ఎన్నికల వేళ... మావోయిస్టుల కలకలం | Maoists say Orissa tribal leader betrayed them | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ... మావోయిస్టుల కలకలం

Published Tue, Mar 18 2014 2:13 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

ఎన్నికల వేళ... మావోయిస్టుల కలకలం - Sakshi

ఎన్నికల వేళ... మావోయిస్టుల కలకలం

సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎన్నికల వేళ మావోయిస్టుల కలకలం రేగింది. మావోయిస్టు నేత దయ ఒడిశాలో విడుదల చేసిన ప్రకటనతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. ఎన్నికలు బహిష్కరిస్తూ పిలుపునివ్వడంతో రాజకీయ నాయకుల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. హిట్‌లిస్టులో ఉన్న నేతలతో పాటు ఇతరత్రా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులందర్నీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం చేసింది. కేడర్‌ని విచ్ఛిన్నం చేస్తున్న పోలీసుల్ని గట్టి దెబ్బ తీయాలన్న యోచనలో మావోయిస్టు నాయకత్వం ఉంది. ప్రలోభాలతో మావోయిస్టులను లొంగదీసుకుని, కీలక సమాచారాన్ని రాబట్టుకుని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఏఓబీలో సంచరిస్తున్న దళాలు అప్రమత్తమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో జల్లెడ పడుతుండడంతో ఇక్కడికొచ్చిన దాదాపు 150 మంది మావోయిస్టులు పక్కా వ్యూహ రచన చేసినట్టు తెలిసింది. ఇప్పటికే పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్‌పై రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. 
 
 సరైన సమయం కోసం వేచి చూసి దాడులకు దిగాలని యోచిస్తున్నట్టు భోగట్టా.   ఈ నేపథ్యంలో వరుసగా ఎన్నికలు రావడం, పోలీసులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతుండడంతో ఇదే అవకాశంగా తీసుకుని చెలరేగిపోవాలని భావిస్తున్నట్టు సమాచారం. తమ సత్తా ఏంటో చూపించేలా  ముందస్తు హెచ్చరికలు చేసి,  విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలిసింది.  ఈ క్రమంలో మావోయిస్టు నేత దయ సోమవారం ఒడిశాలో ప్రకటన విడుదల చేసినట్టు తెలిసింది. ఎన్నికలను బహిష్కరించాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని, ప్రజాప్రతినిధులపై దాడులు తప్పవని ఆ ప్రకటనలో హెచ్చరించినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో బల్లపాడు తదితర గ్రామాల్లో ప్రత్యేక పోస్టర్లు అతికించారు. టార్గెట్ నేతల్ని తీసుకొచ్చి ప్రజాకోర్టు నిర్వహిస్తామని వాటిలో పేర్కొన్నారు.
 
 హిట్‌లిస్ట్‌లో 14 మంది
 ప్రస్తుతం జిల్లాలో దీర్ఘకాలికంగా హిట్ లిస్టులో ఉన్న నేతలు 14 మంది వరకు ఉన్నారు. వారిలో ఎక్కువగా కొమరాడ,కురుపాం, జియ్యమ్మవలస నేతలే ఎక్కువగా ఉన్నారు. వారితో పాటు ప్రస్తుతం పదవుల్లో ఉన్న నేతల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది. వీరికి ఏ క్షణంలోనైనా ముప్పు ఉండొచ్చు. దీంతో జిల్లా  పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది. కూంబింగ్ విసృ్తతం చేసింది. ఎస్టీఎఫ్ బృందాలతో తనిఖీలను ముమ్మరం చేసింది. ఏజెన్సీ పోలీసు స్టేషన్లలో బందోబస్తు పెంచింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా ఆస్తులకు కూడా రక్షణ చర్యలు తీసుకుంటోంది.   
 
 హెచ్చరికలు జారీ 
 మావోయిస్టు నేత హెచ్చరికతో రాజకీయ నాయకుల్లో భయాందోళన మొదలైంది. వారి ప్రకటన కంటి మీద కునుకు లేకుండా చేసింది. అందుకు తగ్గట్టుగానే పోలీస్ యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించేటప్పుడు పోలీసులకు సమాచారమిచ్చి వెళ్లాలని, బందోబస్తు లేకుండా వెళ్లవద్దని  సూచిస్తోంది. సాధ్యమైనంత వరకు శివారు ప్రాంతాలకు వెళ్లకుండా  ఉంటేనే మంచిదని ముందస్తు జాగ్రత్తలు చెబుతోంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిమిత్తం ప్రచారానికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న గిరి సీమలో మళ్లీ యుద్ధ వాతావరణం చోటు చేసుకోనుందా అన్న ఆందోళన మొదలైంది. మావోల ప్రతీకారేచ్ఛ చర్యలతో ఎప్పుడే ముప్పు పొంచి ఉంటుందోనన్న భయం పట్టుకుంది.   

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement