మావోలపై గిరిజనుల తిరుగుబాటు! | Maovos on the tribal revolt! | Sakshi
Sakshi News home page

మావోలపై గిరిజనుల తిరుగుబాటు!

Published Tue, Oct 21 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

మావోలపై గిరిజనుల తిరుగుబాటు!

మావోలపై గిరిజనుల తిరుగుబాటు!

డిప్యూటీ కమాండెంట్, ఇద్దరు మిలీషియా సభ్యుల హత్య   విశాఖ ఏజెన్సీలో సంచలనం
 
చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఆదివారం మావోయిస్టుల మీద గిరిజనులు తిరుగుబాటు చేసి.. ముగ్గురు నక్సలైట్లను హతమార్చినట్లు పలువురు గిరిజనులు, పోలీసులు మీడియాకు వెల్లడించారు. మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్ పేరుతో ఒక గిరిజనుడిని హత్యచేసి, మరొకరిని శిక్షించేం దుకు ప్రయత్నించటంతో వారిపై ఆగ్రహిం చిన గిరిజనులు మూకుమ్మడిగా తిరుగుబా టు చేశారని.. మావోయిస్టు దళ డిప్యూటీ కమాండెంట్‌ను, మరో ఇద్దరిని చంపేశారని వారు వివరించారు. ఈ సంఘటనతో విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీ ఉద్రిక్తంగా మారింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి.. ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్న గిరిజనులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ...

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలానికి చెందిన కల్కి భవాని దీక్ష గురుస్వామి సింహాచలం శిద్ధి ఆదివారం కోరుకొండలో పూజలు నిర్వహించి.. బలపం గ్రామానికి చెందిన మాలధారుడు సంజీవరావుతో కలిసి ద్విచక్రవాహనంపై జి.మాడుగుల బయలుదేరారు. అక్కడ మాటువేసిన మావోయిస్టు దళ డిప్యూటీ కమాండెంట్ శరత్, మిలీషియా సభ్యులు ఆనంద్, రాజేశ్వరరావు, గణపతిలు రెండు ద్విచక్రవాహనాల్లో వెంబడించారు. రాళ్లగెడ్డ సమీపంలో సింహాచలం, సంజీవరావులను అదుపులోకి తీసుకుని.. సంజీవరావును అక్కడికక్కడే తుపాకితో కాల్చి చంపేశారు. గురుస్వామి సింహాచల శిద్ధిని చేతులు వెనక్కి కట్టి కోరుకొండ తీసుకొచ్చారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి ఆయన్ని చంపేయాలని మావోయిస్టులు భావించారు. అప్పటికే  అక్కడికి పెద్ద సంఖ్యలో కల్కి భవాని దీక్షాధారులు చేరుకున్నారు. తమ గురుస్వామి సింహాచలం శిద్ధిని మావోయిస్టులు హత్యచేయనున్నారని గ్రహించి ఆ దీక్షాధారులంతా ఒక్కసారిగా మావోయిస్టులపై తిరగబడ్డారు. ముందుగా మావోయిస్టు డిప్యూటీ కమాండెంట్ శరత్‌పై దాడిచేసి చంపేశారు. దీంతో దళసభ్యుడు ఆనంద్ ఏకే47 తుపాకితో భక్తులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఆగ్రహంతో రగిలిపోతున్న భక్తులు అతడిపైకి వెళ్లి ఏకే 47ను లాక్కుని గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపటంతో ఆనంద్ సమీప అడవుల్లోకి పరారయ్యాడు. మిలీషియా సభ్యులు రాజేశ్వరరావు, గణపతి పరారయ్యేందుకు ప్రయత్నించగా భక్తులు వెంటాడి రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. రాజేశ్వరరావు మృతదేహాన్ని సమీప కాలువలో పడేశారు. సమీపంలోని అడవుల్లో ఉన్న మరో 15 మంది వరకు మావోయిస్టులు గిరిజనుల ఆగ్రహాన్ని చూసి పరారయ్యారు. ఈ ఘటనలపై ఆదివారం రాత్రి కొందరు గిరిజనులు చింతపల్లి పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. సోమవారం ఉదయం డీఎస్‌పీ అశోక్‌కుమార్ సిబ్బందితో వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకుని చింతపల్లి తీసుకొచ్చి పోస్టుమార్టం చేయించారు. డీఐజీ ఉమాపతి, ఎస్‌పీ కోయ ప్రవీణ్, ఓఎస్‌డీ విశాల్‌గున్నీ సోమవారం చింతపల్లి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

శరత్ డైరీ స్వాధీనం: ఘటనా స్థలంలో మావోయిస్టు నేత శరత్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీని పరిశీలించగా మావోయిస్టుల పథకం బయటపడినట్లు చెప్తున్నారు. సంజీవరావు ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో గిరిజనులను మావోయిస్టు ఉద్యమానికి దూరం చేస్తున్నారని, గిరిజనులకు డబ్బులు ఆశచూపి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని డైరీలో ఉంది. అందుకే సంజీవరావును చంపేయాలని దళం నిర్ణయించినట్లు రాసివుంది. గిరిజనుల చేతుల్లో హతమైన మావోయిస్టు నేత శరత్‌ది కొయ్యూరు మండలం కన్నవరం. మిలీషియా సభ్యులు రాజేశ్వరరావుది గన్నెలబంద. గణపతిది పెద్దపల్లి గ్రామం. గిరిజనులు మూకుమ్మడిగా ఆగ్రహంతో ఎదురుదాడి చేసి ముగ్గురిని హతమార్చడం మావోయిస్టులకు ఎదురుదెబ్బగానే పరిగణిస్తున్నారు.
 
మావోయిస్టులు ప్రజల మద్దతు కోల్పోయారు: ఏపీ డీజీపీ


 మావోయిస్టులు ప్రజల మద్దతు కోల్పోయారని, వారిపై ప్రజలే తిరగబడి చంపే పరిస్థితిని తెచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల తెగువ అభినందనీయమని విజయవాడలో సోమవారం ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement