బంగారం స్మగ్లింగ్‌లోనూ చైనా మార్కు | Mark gullsmugling i chaina | Sakshi
Sakshi News home page

బంగారం స్మగ్లింగ్‌లోనూ చైనా మార్కు

Published Tue, Apr 8 2014 4:56 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

బంగారం స్మగ్లింగ్‌లోనూ చైనా మార్కు - Sakshi

బంగారం స్మగ్లింగ్‌లోనూ చైనా మార్కు

హైదరాబాద్‌పై కన్నేసిన చైనా మాఫియా
నాలుగు దేశాల మీదుగా ఇక్కడకు తరలింపు
కేజీ బంగారానికి రూ.లక్షకు పైగా కమీషన్
అమాయకులకు తెలియకుండా కూడా రవాణా
ఆధారాలు సేకరించిన కస్టమ్స్ అధికారులు


హైదరాబాద్: జనవరి 12న ఐదు కేజీలు... 15న ఒక కేజీ... ఫిబ్రవరి 10న అరకేజీ... 28న రెండున్నర కేజీలు... మార్చి 4న కేజీన్నర... 13న ఆరున్నర కేజీలు... 20న 1.9 కేజీలు... ఏప్రిల్ 1న ఆరున్నర కేజీలు... శుక్రవారం కిలోన్నర... శనివారం 685 గ్రాములు... ఈ ఏడాది ఇప్పటివరకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం జాబితా ఇది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో చైనాకు చెందిన కొందరు సూత్రధారులు ఈ అక్రమ రవాణాను వ్యవస్థీకృతంగా నడుపుతున్నారని తేలింది.

దీనికి సంబంధించిన కీలక ఆధారాలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు సేకరించారు. పరారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు రిసీవర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. భారత మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో పాటు దిగుమతి సుంకం పైకి, రూపాయి విలువ కిందికి చేరడమే ఈ మాఫియాకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 గణనీయంగా పెరిగిన ధరలు, పన్నులతో...
 
దేశంలో పసిడికి ఉన్న డిమాండ్‌కు త గ్గట్టు ఉత్పత్తి జరగట్లేదు. ఈ కారణంగానే దిగుమతిపైన ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా రూపాయి మారకం విలువకు బంగారం ధరలతో లింకు ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.8 గ్రాములు) బంగారం 1,900 డాలర్లు ఉండగా... ఇక్కడ 10 గ్రాములు రూ.26 వేల వరకు ఉండేది. ప్రస్తుతం ఆ ధర 1,300 డాలర్లకు పడిపోయినా దేశీయ మార్కెట్‌లో రూ.30 వేలను తాకుతోంది. దీనికి కారణం అప్పట్లో డాలర్‌తో ఉన్న రూపాయి మారకం విలువ ప్రస్తుతం 20 శాతం మేర పడిపోవడమే. ఆయా దేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసినవారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలన్నా పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 ఉండేది. ఇటీవల 10 గ్రాముల పసిడికి ఉన్న ఖరీదును ప్రతి 15 రోజులకు సరాసరి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. దీంతో కనీసం రూ.మూడు వేల వరకు పన్ను పడుతోంది. ఇవన్నీ అక్రమ రవాణా పెంచడానికి కారణమయ్యాయి.

 కమీషన్ పేరు చెప్పి, విషయం చెప్పకుండా...

 హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇటీవల ఇంటర్నేషనల్ సర్వీసులు బాగా పెరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు వాసులు కూడా ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో చైనా మాఫియా బంగారం అక్రమ రవాణాకు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకుంది. ఆయా దేశాల్లో కార్మికులుగా పని చేస్తూ, విజిటింగ్ వీసాలపైన వెళ్లి వస్తున్న వారిని చైనా ముఠా అక్కడి విమానాశ్రయాల్లో కాపుకాసి గుర్తిస్తున్నారు. బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి, అనేక రకాలుగా పార్సిల్ చేసి వారికి అప్పగిస్తున్నారు. కొందరికి కేజీ బంగారానికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు కమీషన్ ఇస్తామంటూ ఆశచూపుతుండగా... మరికొందరికి బంగారమని చెప్పకుండా పార్సిల్స్ రూపంలో ఇస్తూ హైదరాబాద్‌లో తమ వారికి ఇవ్వాల్సిందిగా చెప్పి పంపిస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు వీరు పట్టుబడితే అక్కడితో లింకు తెంపేస్తున్నారు. విమానాశ్రయం దాటి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడి రిసీవర్లకు చేర్చి దందా చేపడుతున్నారు.
 
రిసీవర్లుగా ముగ్గురు గుర్తింపు...

 ఇటీవల పట్టుబడిన వారిని విచారించిన కస్టమ్స్ అధికారులు ఈ అంశాలతో పాటు కీలకమైన ఆధారాలను సేకరించారు. ఆయా దేశాల నుంచి చైనా మాఫియా పంపిస్తున్న బంగారాన్ని హైదరాబాద్‌కు చెందిన రిసీవర్లుగా భావిస్తున్న రాజుభయ్యా, షకీల్, జిలానీ తీసుకుంటున్నారని తే లింది. వీరు బాహ్యవిపణిలో విక్రయించి వచ్చే లాభాల్లో ఒప్పందం చేసుకున్న మొత్తం హవాలా రూపంలో చైనాలోని సూత్రధారులకు పం పుతున్నారని తేలింది. ఈ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్న కస్టమ్స్ అధికారులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా కట్టుదిట్టం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement