ఇదో రకం..పంచాయితీ!
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: పాలకొండ పట్టణం నగర పంచాయతీగా మారి సుమారు ఏడాది అవుతోంది. ఇటీవలే ఎన్నికలు జరిగి కౌన్సిల్ పాలకవర్గం కూడా ఏర్పాటైంది. కానీ ఇప్పటికీ ఇక్కడ పంచాయతీ పాలనే కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రధాన మార్కెట్లోని షాపుల లీజుల వ్యవహారం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి పట్టణ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారం నగర పంచాయతీగా మారిన తర్వాత కూడా కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఏడాది క్రితం వరకు పంచాయతీగా ఉన్న పాలకొండలోని ప్రధాన మార్కె ట్లో సుమారు 28 ఏళ్ల క్రితం నిర్మించిన షాపులకు ఇప్పటికీ నామమాత్రపు అద్దెలే వసూలు చేస్తున్నారు. 36 పెద్ద, 10 చిన్న షాపులు ఉండగా.. పెద్ద షాపులకు రూ.700, చిన్నవాటికి రూ.550 అద్దె వసూలవుతున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీని వల్ల పాలకొండ గత పంచాయతీ, ప్రస్తుత నగర పంచాయతీ లక్షల్లోనే ఆదాయం కోల్పోయింది.
స్థాయి పెరిగిన తర్వాత కూడా..
నిబంధనల మేరకు అద్దె ఎందుకు పెంచలేదన్నది పక్కన పెడితే నగర పంచాయతీగా మారిన తర్వాత దాని పరిధిలోని షాపులు, ఇతరత్రా లీజులను టెండర్లు పిలిచి మున్సిపల్ కమిషనర్ ఖరారు చేయాల్సి ఉంటంది. అద్దెలను కూడా నగర పంచాయతీ స్థాయికి తగినట్లు పెంచాలి. కానీ ఇక్కడ మాత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలోని కొందరి అండదండలతో పాలకొండ పంచాయతీ అధికారులే ఆ పని కానిచ్చేశారు. మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆగమేఘాల మీద పాత రేట్లకే లీజులు రెన్యూవల్ చేసేశారు. స్పెషల్ అధికారి దృష్టికి గానీ, కమిషనర్ దృష్టికి గానీ తీసుకువెళ్లక పోవడంతో అక్రమాలు జరగాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందుకు గాను ఒక్కో షాపు నుంచి వేలల్లో దండుకున్నారని తెలుస్తోంది. పైగా తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు లీజు కాలపరిమితి పెంచినట్లు ఆయా అధికారుల సంతకాలతోనే ధ్రువపత్రాలు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ధ్రువపత్రాలు చూపేందుకు అటు సిబ్బంది.. ఇటు షాపుల నిర్వాహకులు అంతగా సుముఖత చూపకపోవడంతో అధికారుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయన్న అనుమానాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు.
సొంత షాపుల్లా చెలామణీ
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన మార్కెట్‌లో ఉన్న ఈ 46 షాపులను ఏళ్ల తరబడి అనుభవిస్తున్న వర్తకులు వీటిని తమ సొంత షాపుల్లా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వీటిలో వస్త్రాలు, కిరాణా, సిమెంట్, ఐరెన్ వంటి హోల్‌సేల్ దుకాణాలతో పాటు కూరగాయలు, పండ్లు వంటి చిరు వ్యాపారాలు చేస్తున్నవారూ ఉన్నారు. ప్రతి మూడేళ్లకోసారి లీజు గడువును పొడిగించుకుంటూ నామమాత్రపు అద్దెలు చెల్లిస్తున్నారు. తాజాగా 2014-15 సంవత్సరానికి గాను ఈ షాపుల రెన్యూవల్ ఇటీవలే జరిగింది. అయితే అద్దెలు మాత్రం పంచాయతీ హయాంలో చెల్లిస్తున్న రేట్లే చెల్లిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కాగా లీజుకు తీసుకున్న ఈ షాపుల్లో కొన్నింటిని లీజుదారులు వేరే వ్యక్తులకు ఇచ్చి అధిక అద్దెలు వసూలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై నగర పంచాయతీ కమిషనర్ టి.కనకరాజు వద్ద ప్రస్తావించగా ఏళ్ల తరబడి ఉన్న వ్యాపారస్తులు మూడేళ్లకోసారి షాపుల రెన్యూవల్‌కు దరఖాస్తు చేస్తున్నారని, తాజాగా మార్చి నెలలో ఈ షాపుల లీజు రెన్యూవల్ చేసిన సమయంలో 33.13 శాతం అద్దె పెంచినట్లు చెప్పడం విశేషం.
ఫైళ్లు చూపించడం లేదు:డీపీవో
ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత ఫైల్ తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ ఫైల్‌ను తనకు చూపించలేదని ఎక్కడ ఉందో కూడా తెలియడంలేదన్నారు. దాంతో తనకూ కూడా అనుమానం కలుగుతోందన్నారు. నగర పంచాయతీగా మారిన తర్వాత లీజు పొడిగింపు అధికారం పంచాయతీ అధికారులకు ఉండదన్నది వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు.