మున్సిపల్ కమిషనర్‌పై టీడీపీ నాయకుల దాడి!
► చొక్కా చించి.. ముఖం వాచేలా కొట్టారంటూ కమిషనర్ ఆవేదన
► చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లపై పోలీసులకు ఫిర్యాదు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ పి.జగన్మోహనరావుపై చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. చొక్కా చించి, ముఖం వాచేలా పిడిగుద్దులు గుద్దారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ జగన్మోహనరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొన్ని పనులకు సంబంధించి బిల్లుల ఫైళ్లపై సంతకాలు చేయాలని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, 18వ వార్డు కౌన్సిలర్ పాతాళ ముకుంద, 12వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి బల్లా శ్రీనివాస్‌లు కమిషనర్‌పై ఒత్తిడి చేశారు.
అయితే, ఆ పనులకు సంబంధించి బిల్లులు సక్రమంగా లేకపోవడంతో కమిషనర్ నిరాకరించారు. బుధవారం రాత్రి కమిషనర్.. మున్సిపల్ కార్యాలయంలోని డీఈ చిరంజీవులు గదిలో ఉండగా చైర్మన్‌తోపాటు, ముకుంద, శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. సంతకాలు చేయాలని బలవంతం చేస్తూ, కమిషనర్‌పై దాడికి తెగబడ్డారు.
ఈ క్రమంలో తన షర్టు చింపి, ముఖంపై పిడుగుద్దులు గుద్దారని కమిషనర్ జగన్మోహనరావు వాపోయారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స పొందారు. తనపై దాడి జరిగిందంటూ సీఐ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే శివాజీ చేయించారేమో.. : చైర్మన్
ఇదే విషయమై మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావును వివరణ కోరగా.. ఎమ్మెల్యే టికెట్ తనకిచ్చేస్తారని ఆందోళనతో స్థానిక ఎమ్మెల్యే శివాజీ ఇదంతా చేయించారని ఆరోపించారు. తనకేమీ తెలియదని చెప్పారు.