ప్లీజ్... ఫోన్ చేయండి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:లంచం అడిగిన మున్సిపల్ కమిషనర్‌ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిచ్చేందుకు 70 ఏళ్ల వృద్ధుడు సాహసించాడు. చదువురాని గ్రామస్తులు మరో అవినీతి అధికారిని పట్టించారు. ఏసీబీ అధికారులు కోరుకుంటున్న చైతన్యం ఇదే. కానీ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడమూ నేరమే. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్న వారూ కటకటాలు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రజలు చేయాల్సిందల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేయడమే.
ఈ విషయంలో జిల్లా ప్రజల్లో ఇంకా కావలసినంత చైతన్యం లేదని వారు బాధపడుతున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, ఫిర్యాదు చేయాలని కోరుతున్నా అనుకున్న స్పందన మాత్రం కొరవడుతోంది. ఫిర్యాదుచేస్తే అధికారులు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందనో, డబ్బు ఖర్చవుతుందనో వారు వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి అటువంటి భయం అక్కర్లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఎంత చిన్నమొత్తం లంచం డిమాండ్ చేసినా మమ్మల్ని గుర్తుంచుకోవాలని, అడిగిన వ్యక్తి పనిపడతామని ఏసీబీ అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫిర్యాదీలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా ఒకేరోజు సాక్ష్యాల సేకరణ, ఫిర్యాదుకు సంబంధించిన లిఖిత పూర్వక అంశాలన్నీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. నిందితుల నుంచి బెదిరింపులు రాకుం డా కూడా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
ఇదీ పరిస్థితి:
జిల్లాలో 2012లో ఓ లంచం కేసు నమోదైంది. 2013లో 9 లంచం కేసులు, ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఒకటి నమోదైంది. పాలకొండ, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌లపై నమోదు చేసిన కేసులు సంచలనం సృష్టించాయి. ఇక 2012 డిసెంబర్‌లో నమోదైన మద్యం సిండికేట్‌ల కేసు జిల్లాలో సంచలనమే అయింది. దీనికి సంబంధించి అధికారులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు పెద్ద సం ఖ్యలో అధికారుల్ని కేటాయించడంతో మిగిలిన కేసులపై దృష్టిసారించలేకపోవడం వాస్తవమేనని శాఖాధికారులే అంగీకరిస్తున్నారు. ఇటీవల కాలంలో నమోదైన కేసుల్లో గత ఏడాది నలుగురికి శిక్ష పడగా, ఈ ఏడాది మరో ముగ్గురికి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి రెండు లంచం కేసులు నమోదయ్యాయి.
ప్రత్యేక డీఎస్పీ
ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒకే డీఎస్పీ బాధ్యతలు నిర్వహించే వారు. దీంతో సీఐ స్థాయి అధికారే ఇక్కడి కేసులు పర్యవేక్షించే వారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఏసీబీకి ప్రత్యేక డీఎస్పీ కేటాయించే అవకాశం ఉంది. సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇక తమకు పని చెప్పాల్సింది ప్రజలేనని అధికారులంటున్నారు.
మిస్‌డ్ కాల్స్ సమస్య
ఏసీబీ అధికారుల్ని మిస్‌డ్ కాల్స్ సమస్య వేధిస్తోంది. ప్రజల్ని చైతన్య పరిచేందుకు పోస్టర్లు, స్టీక్కర్లను బస్సులు, రైళ్లతోపాటు పలు చోట్ల గోడలకు అతికిస్తున్నారు. అందులో ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఈ నంబర్లకు మిస్‌డ్ కాల్స్ ఇస్తున్నారని, తిరిగి చేస్తే ఇది మీ నంబరో, కాదో తెలుసుకునేందుకు చేశామని చెబుతున్నారని అధికారులు వాపోతున్నారు. ఇక మరికొందరు ప్రైవేటు వ్యక్తులపై దాడులు చేయాలని కోరుతున్నారని, తాము ఉన్నది ప్రభుత్వ అధికారులపై నిఘాకు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కొందరు ఫిర్యాదు చేసినా లిఖిత పూర్వకంగా ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం కూడా సమస్యవుతోందంటున్నారు.