‘మార్కెట్’ ధర..! | Market Price | Sakshi
Sakshi News home page

‘మార్కెట్’ ధర..!

Published Wed, Sep 2 2015 2:01 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

‘మార్కెట్’ ధర..! - Sakshi

‘మార్కెట్’ ధర..!

సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు, దుగ్గిరాల మార్కెట్ యార్డుల్లో నియమించనున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. పాలకుల సిఫారసులకే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యం ఇచ్చిందని, పారదర్శకంగా కాకుండా రహస్యంగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎంసీఏ, ఎంబీఏ కంప్యూటర్స్ చేసిన నిరుద్యోగులు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, కంప్యూటర్ సంస్థల్లో శిక్షణ పొందిన అభ్యర్థులను నియమించేందుకు ఏర్పాటు జరిగినట్టు తెలుస్తోంది.

అభ్యర్థులందరికీ తెలిసే విధంగా దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎంప్లాయిమెంట్ ఆఫీసు ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించారు. వీరందరికీ ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్  సెంటరు) ద్వారా పరీక్ష నిర్వహించారు. కంప్యూటర్ వినియోగం, ఈ-మార్కెటింగ్,  ఆన్‌లైన్ ట్రేడింగ్, ఆంగ్ల భాషలో   లెటర్లు రాయగలిగే నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఈ పోస్టుల్లో నియమించాల్సి ఉంటే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికే పోస్టులు ఖరారవుతున్నాయని నిరుద్యోగ అభ్యర్థులు  చెబుతున్నారు. ఈ అక్రమ భర్తీని రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలంటున్నారు.

 16 పోస్టులకు 88 మందికి కాల్‌లెటర్లు...
 గుంటూరు,దుగ్గిరాల మార్కెట్‌యార్డుల్లో ఈ-మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం ది. ఈ యార్డుల్లో కంప్యూటర్లు, ఇతర ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ-మార్కెటింగ్‌ను నిర్వహించడానికి  గుంటూరు యార్డులో 10, దుగ్గిరాల యార్డులో ఆరుగురు ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకున్నారు. పోస్టుల భర్తీకి దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎంప్లాయిమెంట్ ఆఫీసు ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించారు.  మొత్తం 16 పోస్టులకు 88 మందికి లెటర్లు పంపించారు. ఎంసీఏ, ఎంబిఏ కంప్యూటర్స్ చేసిన నిరుద్యోగులు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ బీఎస్సీ, బీకామ్, బీఏ కంప్యూటర్స్ చేసిన అభ్యర్థులకు, చిన్నచిన్న కంప్యూటర్ సంస్థల్లో శిక్షణ  పొందినవారికి కాల్ లెటర్సు పంపారు. శనివారం ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజిలో సిల్క్ పరీక్ష నిర్వహించారు.

 రెండు రోజుల్లో నియామకాలు
 పోస్టుల భర్తీకి ఏర్పడిన కమిటీకి చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, యార్డు చైర్మన్, మార్కెటింగ్ యార్డు సెక్రటరీ, మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ సభ్యులుగా ఉన్నారు. జాయింట్ కలెక్టర్ తరఫున  డీఆర్‌ఓ పరీక్షలను పర్యవేక్షించారు. శనివారం జరిగిన  స్కిల్ పరీక్షలో అర్హులకు, సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర టీడీపీ నేతలు సిఫారసు చేసిన  అభ్యర్థులకు ఆ పోస్టులు ఇస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో నియామకాలు ప్రకటించే అవకాశం ఉందని మిగిలిన అభ్యర్థులు చెబుతున్నారు.

గుంటూరు, దుగ్గిరాల యార్డుల్లో మిర్చి, పసుపు పంటకు మంచి ధర లభించడానికి, రైతుకు ప్రయోజనం కలిగించడానికి ఉద్దేశించిన ఈ-మార్కెటింగ్ విధానంలో కంప్యూటర్ వినియోగంపై పూర్తిగా అవగాహన లేని అభ్యర్థులను నియమించడం ద్వారా రైతులకు నష్టం కలిగించడమేనని వివిధ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement