వివాహిత అనుమానాస్పద మృతి | Married woamn suspicious death in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Wed, May 17 2017 4:30 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

వివాహిత అనుమానాస్పద మృతి - Sakshi

వివాహిత అనుమానాస్పద మృతి

(విశాఖపట్నం) : ఎంవీపీ లాసన్స్‌ బే కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతదేహాన్ని మూడో  పట్టణ పోలీసులు కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం మార్చురీ వద్ద మృతురాలి తల్లి సుబ్బలక్ష్మి, సోదరి శిరీష తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరుకు చెందిన సునీల్‌ రాజు (36), విశాఖపట్నం పాత ఐటీఐ వద్ద నివాసం ఉంటున్న రాజేశ్వరి (33)లకు గత ఏడాది ఆగస్టులో ఏలూరులోని ఓ చర్చిలో ఫాస్టర్‌ సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరూ లాసన్స్‌బే కాలనీలో కాపురం పెట్టారు.

 రాజేశ్వరి నగరానికి చెందిన ఫుల్‌క్రం గ్లోబల్‌ టెక్నాలజీస్‌లో సీనియర్‌ బిల్లర్‌గా పనిచేస్తోంది. సునీల్‌రాజు మాత్రం పనిచేస్తున్నానని ఇంట్లో చెప్పినా ఖాళీగా తిరుగుతున్నాడు. ఇటీవల సునీల్‌రాజు తన తల్లిదండ్రులతో రాజేశ్వరి తల్లి సుబ్బలక్ష్మికి ఫోన్‌ చేయించి రూ.3లక్షలు కట్నంగా ఇవ్వాలని, లేదంటే వారి వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని తన పేరున రాయించాలని కోరాడు. అందుకు రాజేశ్వరి తల్లి నిరాకరిచండంతో వారితో వివాదానికి దిగాడు. అప్పుడప్పుడు తన భార్యతో కట్నం విషయంలో గొడవపడుతుండేవాడు.

 ఈ నేపథ్యంలో ఈ నెల 14న సునీల్‌రాజు పుట్టినరోజు వేడుకను ఇంట్లో రాజేశ్వరి ఘనంగా నిర్వహించింది. అదేరోజు రాత్రి చివరిసారిగా తల్లితో మాట్లాడి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పింది. సోమవారం ఉదయం నుంచి రాజేశ్వరి, సునీల్‌రాజుల ఫోన్‌లు పనిచేయకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు అక్క బావ ఉంటున్న ఇంటికి వెళ్లి రాజేశ్వరి సోదరి శిరీష చూడగా తాళం వేసి ఉండడంతో వెనుతిరిగింది. దిక్కుతోచని స్థితిలో ఏలూరులో ఉంటున్న సునీల్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయమని వారు సలహా ఇచ్చారు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సునీల్‌రాజు ఫోన్‌ కలవడంతో వివరాలు అడిగారు.

ఇంటికి వెళ్లి కిటికీ తెరిచి చూడమని సునీల్‌ రాజు చెప్పడంతో అనుమానం వచ్చిన బంధువులు ముందుగా మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో ఇంటి తలుపును బలవంతంగా తెరిచారు. బెడ్‌ రూంలోని మంచంపై రాజేశ్వరి మృతదేహం పడి ఉంది. దుస్తులతో ఉన్న సూట్‌కేస్‌ బాత్రూంలోను, కప్‌బోర్డ్‌లో ఉన్న చీరలు ఆ గదినిండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రస్తుతం సునీల్‌రాజు పరారీలో ఉన్నాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లి సుబ్బలక్ష్మి ఆరోపిస్తోంది. కట్నం కోసమే తన కుమార్తెను బలి తీసుకున్నారని, విషయం ఏలూరులో ఉన్న సునీల్‌రాజు తల్లిదండ్రులకు కూడా తెలుసని చెబుతున్నారు. పోలీసులు తమకు తగిన న్యాయం చేయాలని మృతురాలి బంధువులు, స్నేహితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement