మహిళా కమిషన్ సభ్యులు ఎదుట సమస్యలను చెబుతున్న బాధితురాలు ధనలక్ష్మి
రేగిడి: నా భర్త నాకు కావాలి.. నా జీవితం నా భర్తతోనే కొనసాగేటట్టు మీరంతా సహకరించాలి.. అలాకాకుంటే నాకు దిక్కులేదంటూ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెంబూరు ధనలక్ష్మి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఎదుట వాపోయింది. కెంబూరు ధనలక్ష్మిది ఇదే మండలం కొర్లవలస గ్రామం. 2016 ఏప్రిల్‌లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెంబూరు వాసుదేవనాయుడుతో వివాహం జరిగింది. ఏడాదిపాటు సంసారం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఈమెకు భర్తతో పాటు అత్తమామలు, కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయని ఈ నెల 22న రేగిడి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదుచేసిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ధనలక్ష్మి భర్త వాసుదేవనాయుడుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదుచేశారు. ధనలక్ష్మి ఇంతటితో ఆగకుండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదుచేసింది.
దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ కొయ్యాన శ్రీవాణితో పాటు జిల్లా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వై.హిమబిందు, డీవీసీ కౌన్సిలర్ కె.నిర్మలతో పాటు రాజాం సీడీపీఓ కె.వసుందరాదేవి లక్ష్మీపురం గ్రామం గురువారం వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలు ధనలక్ష్మి కమిషన్ సభ్యులు ఎదుట తమ గోడును వెల్లబుచ్చారు. వివాహం చేసుకున్న తర్వాత తాను చాలా కష్టాలు అనుభవిస్తున్నానని, తనకు భర్త నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సంతోషం లేకుండా పోతుందని, తనను భర్త చక్కగా చూసుకుంటే జీవితాంతం హాయిగా ఉంటానని కన్నీటి పర్యంతమైంది. తర్వాత రాష్ట్ర కమిషన్ మెంబర్ శ్రీవాణి ధనలక్ష్మి అత్తమామల వాదన విన్నారు. ధనలక్ష్మి భర్త వాసుదేవనాయుడును పిలిపించాలని కుటుంబ సభ్యులకు సూచించడంతో అందుబాటులో లేడని చెప్పారు. దీంతో ఈ విషయంపై శ్రీవాణి మాట్లాడుతూ అమ్మాయికి అవగాహన తక్కువ కావడంతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. భర్తతో పాటు కుటుంబ సభ్యులు సరిపెట్టుకోవాలి. అమ్మాయిని వదిలించుకోవడానికే తప్ప భార్యాభర్తలను ఒక్కటి చేసేందుకు కుటుంబ సభ్యులు సహకరించడంలేదన్నది స్పష్టమవుతుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి భార్యాభర్తలను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని, ఇద్దరికీ నచ్చజెప్పి జీవితం సాఫీగా నడిచేలా చూస్తామన్నారు. వీరితో పాటు అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జె.జ్ఞానమ్మ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment