తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరికీ అవసరమని ఇన్‌చార్జ్ జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారిణి జీఎస్ వరలక్ష్మి పేర్కొన్నారు.
కాకినాడ సిటీ : తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరికీ అవసరమని ఇన్‌చార్జ్ జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారిణి జీఎస్ వరలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆండాళ్లమ్మ జూనియర్ కళాశాల ప్రాంగణంలో తైక్వాండో వేసవి శిక్షణా శిబిరాన్ని డీఎస్‌డీఓ వరలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తైక్వాండో వంటి క్రీడల్లో శిక్షణ పొందడం ద్వారా వ్యాయామంతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు.
తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు మాట్లాడుతూ స్వీయక్రమశిక్షణ-బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, ఆరు సంవత్సరాల వయస్సు నుంచి కరాటే నేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. జిల్లాలో క్రీడాభివృద్ధి మండలి, తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలుప్రాంతాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ నెల 31 వరకు నిర్వహించే శిక్షణ ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.పద్మనాభం, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రవిరాజ్, తైక్వోండో అసోసియేన్ అధ్యక్షులు మధుసూదనరావు, జాయింట్ సెక్రటరీ సుబ్బారావు, ట్రజరర్ వై.సత్యనారాయణ, కోచ్ సత్యనారాయణ పాల్గొన్నారు.