- మార్షల్ ఆర్ట్స్‌పై యలమంచిలి యువకుడి ప్రచారం
- హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర
సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఏదో ఓ మూల రోజుకో ఘోరం. ఆడ పిల్లలపై అఘాయిత్యం. పసి పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి సంఘటనలు చూసి సమాజం ఏమైపోతోందని ప్రతి ఒక్కరిలోనూ ఆవేదన. అయితే ఆ కుర్రాడు ఆవేదన పడి ఊరుకోలేదు. తనవంతుగా ఏం చేయగలనా? అని ఆలోచించాడు. మహిళలను మేల్కొలపడానికి హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజూ ఒకటి రెండు చోట్ల ఆత్మరక్షణపై విద్యార్థినుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నించాడు. అతడే యలమంచిలికి చెందిన సతీష్‌కుమార్ వెలగ.
10 రోజులు.. 650 కిలోమీటర్లు
సతీష్ హైదరాబాద్‌లోని జీఈ కాపిటల్స్‌లో ప్రాసెస్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఓ మహిళపై లైంగిక దాడి జరిగిన సంఘటనతో చలించిపోయాడు. శారీరకంగా బలహీనులైన మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే తమను తాము రక్షించుకోగలరని, ఆ దిశగా ప్రచారం చేసేందుకు పూనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ‘ఆడపిల్లల ఆత్మ రక్షణ-భావి తరాలకు రక్షణ’ నినాదంతో ఈ నెల 17న హైదరాబాద్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించాడు. పది రోజులు ప్రయాణించి సోమవారం విశాఖ చేరుకున్నాడు. సాగరతీరంలో తన యాత్రను ముగించాడు. మధ్యలో తనకు తారసపడిన ప్రతి నగరం, పట్టణంలోని కళాశాలల వద్దకెళ్లి మహిళ ఆత్మ రక్షణపై తనకు తెలిసింది వివరించాడు. వారితో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు కృషి చేశాడు.
మార్షల్ ఆర్ట్స్ బీమాలాంటిది
జీవితానికి బీమా ఎలాంటిదో.. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ కూడా అలాంటివే. టెక్నాలజీని అమ్మాయిలు వాడుకోవాలి. GoSafe, bSafe, Fightback, Life 360 తదితర అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒంటరిగా వెళ్లేటప్పుడు ప్రయాణించే వాహనం నంబర్, ఫొటో తదితర వివరాలు వాట్స్‌ప్‌లాంటి సౌకర్యాల ద్వారా తల్లిదండ్రులు, బంధువులకు చేరే ఏర్పాట్లు చేయాలి. ఈ విషయం డ్రైవర్‌కు తెలిసేటట్టు వ్యవహరిస్తే.. వారు అనుచితంగా వ్యవహరించడానికి భయపడతారు.
- సతీష్‌కుమార్ వెలగ