రత్నగిరి దిగువన నిర్మాణాలపై అభ్యంతరాలు బేఖాతరు
బెంగళూర్ ఆయుర్వేద వర్సిటీకి సహజ ఆస్పత్రి నిర్వహణ
మొదటిఘాట్ రోడ్ నుంచి మరో మెట్లదారి నిర్మాణం
దేవాదాయశాఖ అధికారుల సమావేశంలో నిర్ణయం
ముఖ్యమంత్రి సూచిస్తే తప్ప యథాతథంగా అమలు
అన్నవరం :
అన్నవరం దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. ఇకపై సత్రాలు, ఇతర కట్టడాలను కొండదిగువనే నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో సోమ, మంగళ వారాల్లో ప్రముఖ దేవాలయాల ఈఓ లతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు అన్నవరం ఈఓ నాగేశ్వరరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు.
కాగా.. కొండదిగువన నిర్మించే సత్రాల్లో భక్తులు బస చేయరని, ఇప్పటికే సత్యనికేతన్, పంపా డార్మిటరీ నిరుపయోగంగా ఉన్నాయని మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించి అలా నిర్మించినా నిధుల దుర్వినియోగం తప్ప ప్రయోజనం ఉండదనే విమర్శలు వినిపించాయి. అయితే ఉన్నతాధికారులు మాత్రం రత్నగిరి, సత్యగిరిలపై మొక్కలు, ఉద్యాన వనాల పెంపకం మినహా నిర్మాణాలు చేపట్ట వద్దని ఆదేశించారు.
దీంతో సత్యగిరిపై రూ.15 కోట్లతో నిర్మించతలపెట్టిన 135 గదుల సత్రాన్ని కొండదిగువన నిర్మించాలి లేదా తాత్కాలికంగా నిలిపివేయూలి. మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన నిర్మాణాలు తప్ప మిగిలినవి చేపట్టరాదని నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మాస్టర్‌ప్లాన్ ను పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఒకవేళ ఆయన సూచిస్తే తప్ప మాస్టరప్లాన్‌లో ఎలాంటి మార్పూ ఉండదని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
సత్యదేవ అతిథిగృహం స్థానంలో వ్రతమండపాలు
మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయానికి వెనుక గల సత్యదేవ అతిథిగృహం కూల్చి వేసి అక్కడ వ్రతమండపాలు నిర్మిస్తారు. టీటీడీ సత్రం స్థలంలో కూడా వ్రతమండపాలు నిర్మిస్తారు. న్యూ సీసీ సత్రం సగం కూల్చివేసి అందులో అన్నదాన భవనం నిర్మిస్తారు. రత్నగిరిపై సహజ ప్రకృతి చికిత్సాలయాన్ని 11 ఏళ్లకు బెంగళూర్‌లోని వివేకానంద ఆయుర్వేద యూనివర్సిటీ నిర్వహణకు ఇవ్వనున్నారు. వెల్‌నెస్ సెంటర్ పేరుతో ఇందులో యోగ, ఆయుర్వేద చికిత్స నామమాత్రపు రుసుంకు అందచేస్తారు. ప్రస్తుతం సహజలో పనిచేస్తున్న సిబ్బందికి ఆ వర్సిటీ మూడు నెలలు శిక్షణనిచ్చి ఉపయోగించుకుంటుంది. రూ.20 లక్షలతో దేవస్థానంలో సుమారు 70 చోట్ల సైన్‌బోర్డులను ఈనెలలోనే ఏర్పాటు చేయనున్నారు. యాగశాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మొదటి ఘాట్‌రోడ్ టోల్‌గేట్ నుంచి రత్నగిరికి కొత్తగా మెట్లదారి ఏర్పాటు చేయనున్నారు.
మాస్టర్‌ప్లాన్‌కు పచ్చజెండా
Published Thu, Mar 3 2016 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement
Advertisement