- రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటున్న రైతులు
- మంత్రుల సమావేశాలకు నల్లబ్యాడ్జీలతో హాజరవుతున్న వైనం
తుళ్లూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు అదే మాట. అదే బాటన పయనిస్తున్నారు. ఆయా గ్రామాలలో మంత్రులు ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు రైతులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరువుతు న్నారు. ఆది నుంచి చెబుతున్నట్టుగానే రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదంటూనే సారవంతమైన భూములు ఇవ్వబోమంటున్నారు.
ఆదివారం తూళ్లూరు, నేలపాడు గ్రామాల్లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్, టీడీపీ జిల్లా కన్వీనర్ జీవీ ఆంజనేయులు తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను తెలుసుకుని వాటిని ముఖ్యమంత్రి చందబాబు దృష్టికి తీసుకువెళతామని చెప్పడం రైతుల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటివరకు తమ సమస్యలకు పరిష్కారం చూపకుండానే భూముల ఇవ్వాలని ప్రభుత్వం మంత్రులను పంపడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే తుళ్లూరు మండలంలోని జరీబు(ఉద్యాన)భూముల రైతులు ఒక వర్గంగా ఏర్పడి భూములు ఇవ్వబోమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యం మొదలు పెట్టారు. మెట్ట రైతులు మరో వర్గంగా ఏర్పడి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
రైతునాయకులు బెల్లంకొండ నరసింహారావు మాత్రం భూములు ఇవ్వబోమంటున్న రైతుల్లో వున్న అనుమానాలను తొలగించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని, వారికి ఎలాంటి ప్యాకేజీ ఇస్తే బాగుంటుందో ఆలోచన చేయాలని ఇలా పలు సూచనలు ఉప సంఘం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ప్రజాసంఘాలు, రైతు సంఘాలు చెబుతున్న విషయాలను కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం వుందంటున్నారు.
అనుకూల గ్రామాలలోనే సమావేశాలు
మంత్రులు తమ నిర్ణయూనికి అనుకూలంగా ఉన్న గ్రామాల్లోనే పర్యటించడంపై విమర్శలు వినిపించారు. గతంలో అధికారులు పర్యటించిన గ్రామాలు కాకుండా మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయుని పాలెం గ్రామాల్లో పర్యటిస్తే బాగుండేదని పలువురు వ్యాఖ్యానించారు. సోమవారం వీరు శాఖమూరు, ఐనవోలు గ్రామాల్లోనూ, మంగళవారం దొండపాడు, బోరుపాలెం గ్రామాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.
అనుకూల గ్రామాలతో పాటు వ్యతిరేక గ్రామాలలో కూడా సమావేశాలు నిర్వహించి రైతుల మనో భావాలను అర్థం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆందోళనలో వున్న రైతులను మరింత ఆందోళనకు గురిచేసే విధంగా ప్రభుత్వం, అధికారులు, ప్రవర్తిస్తూ రాయపూడి, మందడం, ఉద్దండ్రాయుని పాలెం రైతులను అవమాన పరుస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నతీరు సరైంది కాదని వారంటున్నారు. ఇప్పటికైనా ఆయా గ్రామాలలో కేబినెట్ ఉపసంఘం సమావేశాలు నిర్వహించాలని మండల రైతులు కోరుతున్నారు.
కౌలురైతుల డిమాండ్‌లు పరిశీలించాలి
ఉన్న భూములు అన్నీ రైతులు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. ఇంతకాలం ఆ భూములు కౌలుచేసుకుని బతుకుతున్న రెతుల పరిస్థితి ఏమిటి, ఇంట్లో వున్న బంగారం అంతా తాకట్టు పెట్టి కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వెంటనే బ్యాంక్‌లలో వున్న బంగారం రుణాలు మొత్తం రద్దు చేయాలి. కౌలు రైతులకు వున్న ట్రాక్టర్లను రాజధాని నిర్మాణాలకు వాడుకోవాలి.
- వెల్లంకి నరసయ్య, తుళ్లూరు కౌలురైతు సంఘం నాయకులు
అసైన్డ్ భూ లబ్ధిదారులకు అన్యాయం జరిగితే
ఉద్యమమే.. అసైన్డ్ భూముల లబ్ధిదారులకూ రైతులకు వర్తింపజేసే ప్యాకేజీలు అమలు చేయాలి. అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. స్థలాలు ఇప్పించి పక్కాఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రస్తుతం ఆ భూములు అనుభవిస్తున్నారో వారికే అన్ని హక్కులు ఇవ్వాలి. న్యాయం చేస్తామని చెప్పిన ఎంఎల్‌ఏఅన్న మాటలు నిలబెట్టుకోవాలి లేకుంటే ఉద్యమం చేస్తాం.
- కంతేటి బ్రహ్మయ్య, బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి
చిన్న, సన్నకారు రైతులు ఏం కావాలి?
రెండెకరాలు వ్యవసాయం చేసుకుని బతికేస్తున్నాం, రేపటి నుంచి మాకు పనేం ఉంటుంది. సిమెంటు బొచ్చెలు మోసే వయసు కాదు. కూలి పనులు అంతకంటే చేయలేం. వ్యవసాయం లేక పోతే మాలాంటి వాళ్లు ఎలా బతకాలి. రాజధాని నిర్మాణం కావాలనే వుంది. కానీ బతుకుమీద భయం ఎక్కువవుతోంది. ప్రభుత్వం మా లాంటి వారికి ఓ దారి చూపాలి. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతున్నాం.
- జమ్ముల జైలు,సన్నకారు రైతు