మట్కా మాయ
సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు
సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు
కోట్లాది రూపాయలు దండుకుంటున్న బీటర్లు
ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి ప్రజలు
మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసులు
అనంతపురం క్రైం : రూపాయికి రూ.80 తగులుతుందని ఆశపెడుతూ పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మట్కా జూదం సాగుతోంది. మట్కా తగలడం దేవుడుకెరుక గాని మట్కా రాపిస్తున్న బీటర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. మట్కా జిల్లాలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీని మాయలోపడి అనేకమంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో మట్కాను నడుపుతున్న నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు చెట్లుకింద..కాలనీల శివార్లలో మట్కా రాసే బీటర్లు ఈరోజు సెల్‌ఫోన్‌లు...ఇంటర్ నెట్ సౌకర్యంతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఒక సారి ఈ రొచ్చులో దిగితే బయట పడడం కష్టం. ఒకమట్కా చార్టు పెట్టుకుని అంకెలగారడీ చేసుకుంటూ ఉండాల్సిందే. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం దీనికి అలవాటుపడి బయటపడలేక పోతున్నారు.
పోలీసులకు సవాలుగా మట్కా
మట్కా ఉచ్చులో పడి వేలాది కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. మట్కాను నియంత్రించాల్సిన పోలీసుశాఖ మీనమేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.కొందరు కిందిస్థాయి పోలీసులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. ఫలితంగా మట్కా నిర్వాహకులు బీటర్లను ఏర్పాటు చేసుకుని రాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనంతపురంలో పలుమార్లు మట్కా బీటర్లను పట్టుకున్న పోలీసులు వారిపై కేసులు బనాయించారు. అయితే వారి వెనుక ఉన్న వారి జోలికి మాత్రం వెళ్లలేదు.
జిల్లాలో హిందూపురం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, ఉరవకొండ, గుత్తి తదితర ప్రాంతాల్లో మట్కా జోరుగా సాగుతోంది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన తాడిపత్రి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ కాంప్లెక్స్, విద్యుత్ నగర్ చౌరస్తా, కళ్యాణదుర్గం రోడ్డు, బసవన్నకట్ట సమీపం, పాత కమలానగర్ తదితర ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల ద్వారా మట్కా కార్యకలాపాలను బీటర్లు జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసు నిఘా వర్గాలు కూడా ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిసింది.
వారి కనుసన్నల్లోనే...
మట్కా కార్యకలాపాలు అంతా పాత బీటర్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయని తెలుస్తోంది. నిర్వాహకులు పాత బీటర్లను చేరదీసి ఇంటర్ నెట్, సెల్‌ఫోన్‌ల ఆధారంగా మట్కా నడుపుతున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసినా మట్కా వ్యవహరం ఎలా ఉన్న తమకు తమ వాటా ఇస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.