
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ మలికగర్గ్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): అవినీతి నిరోధకశాఖ అధికారుల వలకు చిక్కిన అవినీతి తిమింగలాలను సంబంధిత కేసుల నుంచి తప్పిస్తామంటూ నమ్మించి రూ.లక్షలు దండుకుంటున్న ఇద్దరు ఘరానా మోసగాళ్లు కృష్ణాజిల్లా పోలీసులకు చిక్కారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ మలికగర్గ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా నల్లమడ మండలం మంగళవెలమద్దికి చెందిన రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్ మంగలి శ్రీను, అదే జిల్లా కొట్టాపూర్ గ్రామానికి చెందిన నూతేటి జయకృష్ణ దాదాపు 20 ఏళ్లుగా బైక్ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏసీబీ వలలో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగుల బంధువులకు ఫోన్ చేసి .. తాము ఏసీబీ, పోలీసు అధికారులమని.. అడిగినంత డబ్బు ఇస్తే కేసులు లేకుండా చేస్తామంటూ డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారు.
ఇటీవల పెడన పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాను ఏసీబీ డీఎస్పీని అని చెప్పి రూ.3 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని బంధువులను నమ్మించి రాచంపల్లి శ్రీనివాసులు రూ.లక్ష వసూలు చేశాడు. అలాగే పెడన మునిసిపల్ అధికారిని లంచం కేసులో ఏసీబీ అధికారులు పట్టుకోగా.. తాను కూడా ఏసీబీ డీఎస్పీని అంటూ అధికారి బంధువులకు ఫోన్ చేసి.. డబ్బు ఇస్తే కేసు లేకుండా చేస్తానని నమ్మించిన జయకృష్ణ పెద్ద మొత్తంలో డబ్బులు తన ఖాతాలో వేయించుకున్నాడు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు మచిలీపట్నంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరినీ అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు, జయకృష్ణ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అనేక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినట్లు ఏఎస్పీ మలికగర్గ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాసరావుపై 17, జయకృష్ణపై 18 కేసులు ఉన్నట్లు ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment