మాయలేడి | mayalady | Sakshi
Sakshi News home page

మాయలేడి

Published Fri, Dec 5 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

mayalady

ధర్మవరం అర్బన్: ఆమె మహిళా సంఘాలకు నాయకురాలు. మహిళా సంఘాలన్నింటికి ఆమె ముందుండి నడిపిస్తారు. ఇదే అదునుగా ఆమె చెలరేగిపోయింది. మరో ముగ్గురు మహిళలతో కలసి పన్నాగం పన్నింది. అనుకున్నదే తడువుగా దొంగ గ్రూపులను సృష్టించింది. బ్యాంకులకు టోకరా వేసింది. అంతటితో ఆగకుండా మున్సిపాలిటి అధికారులకే తెలియకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ.25 లక్షలు అప్పు చేసి.. అందులో రూ.16 లక్షలకు టోకరా వేసింది. చివరికి అసలు విషయం బయటపడగా.. ఏకంగా మున్సిపాలిటి అధికారులనే బెదిరించింది. తాను ఎమ్మెల్యేకు ఎంత చెబితే అంత అని, జెడ్పీ చైర్మన్ చమన్ తన బంధువు అవుతాడని హెచ్చరించింది. ఏకంగా బ్యాంక్ మేనేజర్లనే ఫోన్లో బెదిరించింది. ఇదీ ధర్మవరం మున్సిపాలిటీలో చోటుచేసుకున్న తతంగం. వివరాలలోకి వెళితే.. ధర్మవరం పట్టణానికి సంబంధించి 2,500 గ్రూపులు ఉన్నాయి.
 
  వీటన్నింటిని కలిపి టీఎల్‌ఎఫ్ (పట్టణ సమాఖ్య) ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా భావమ్మ అనే మహిళ కొనసాగుతోంది. కొద్ది కాలంగా ఈమె నేతృత్వంలో డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లు బినామీ గ్రూపులను తయారు చేసింది. పేపర్లపై సృష్టించిన ఈ గ్రూపులకు లోన్లు తీసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్‌లో రూ.10 లక్షల వరకు లోన్లు తీసుకోగా, ఎస్‌బీఐ, కెనరా, అనంత గ్రామీణ బ్యాంకుల్లో రూ. 15 లక్షల వరకు సంఘాల పేరుతో లోన్లు తీసుకున్నారు. అయితే ఈ లోన్లు తీసుకోవడానికి డ్వాక్రా సంఘాలు అర్హులైనవి అని చెప్పడానికి సీ.ఓలు సంతకాలు చేయాల్సి ఉంటుంది.
 
 అయితే గ్రూపులు నకిలీవి అని తేల్చిన అధికారులు సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో మరో మహిళ సంఘం సభ్యురాలితో కలసి ఏకంగా అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేసింది.   ఇవన్నీ నిజమైన సంతకాలేనని నమ్మిన సెంట్రల్ బ్యాంక్ అధికారులు లోన్లు మంజూరు చేశారు. అయితే తీసుకున్న లోన్లు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు సంబంధిత మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి విచారించగా అసలు విషయం బయట పడింది. మున్సిపాలిటీకి చెందిన కమ్యూనిటి ఆర్గనైజర్(సీఓ) బ్యాంక్‌కు పంపించిన నివేదికల్లో తాను ఎలాంటి సంతకాలు చేయలేదని, ఇవన్నీ ఫోర్జరీ సంతకాలేనని చెప్పడంతో అవాక్కవ్వడం మున్సిపాలిటీ అధికారుల వంతైంది. ఒక వైపు మున్సిపాలిటి అధికారులను, మరో వైపు బ్యాంక్ అధికారులను మభ్యపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకోవడంతో రికవరీ ఎలా చేయాలోనని బ్యాంక్ అధికారులు తలలు పట్టుకున్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాబయ్య ఈ విషయూన్ని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్  దృష్టికి తీసుకెళ్లారు. నిందితురాలిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది.
 
 అధికార పార్టీ నేతల పేర్లతో బెదిరింపులు
 బండారం బట్టబయలు కావడంతో ఎలాగైనా బయటపడాలని భావించి తీవ్రస్థాయిలో ఆమె అధికారులపై ఒత్తిడి తె చ్చింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు తాను ఎంత చెబితే అంత అని, జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ తనకు బంధువునని టీపీఓను బెదిరించింది. ఈ విషయూన్ని ఆయన ధ్రువీకరించారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకును మోసం చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ రఫీ తెలిపారు. కాగా, నిజంగా ఈమెకు రాజకీయ నేతల మద్దతు ఉండే ఇలా చేసిందా.. లేక వారి పేరు వాడుకుని మోసం చేసిందా అనేది విచారణలో తేలాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement