రాజన్న క్యాంటీన్‌లో రూ.4కే భోజనం
- నేడు మంగళగిరిలో ప్రారంభం
- పేదల కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్‌లో ఆదివారం నుంచి నాలుగు రూపాయలకే భోజనాన్ని అందించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. రాజన్న క్యాంటీన్ పేరుతో కేవలం నాలుగు రూపాయలకే అన్నం, కూర, పెరుగు, వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మిగిలిన మూడు రోజులు అరటి పండ్లు, వడియాలు, తాగునీటి ప్యాకెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజైన మే 14వ తేదీన రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
గౌతమ బుద్ధారోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే ఆర్కే ఈ క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని వివరించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్‌లో అందజేస్తున్న భోజనాన్ని పేదలు వినియోగించుకోవాలని కోరారు. నెలలో తొలి పదిరోజులు అంబేడ్కర్ విగ్రహం సెంటర్, మలి పది రోజులు పట్టణంలోని మిద్దె సెంటర్, మిగిలిన పది రోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో భోజనం అందజేయనున్నట్లు వివరించారు.