
జాతర మారుతోంది!
- సౌకర్యాల మాటున నవీన పోకడలు
- స్వచ్ఛతను కోల్పోతున్న మేడారం
- ఆదివాసీ సంప్రదాయూలు కనుమరుగు
- పెరుగుతున్న లడ్డు, పులిహోర సంస్కృతి
- ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామనే తాజా ప్రకటనతో గిరి‘జనం’లో గుబులు
మేడారం, న్యూస్‌లైన్ : తెలంగాణ కుంభమేళాను తల పించే మేడారం మహా జాతరపై ఆధునికత ప్రభావం పడుతోంది. భక్తులకు సౌకర్యాల మాటున జాతర స్వచ్ఛతను కోల్పోతోంది. గిరిజన సంప్రదాయూలకు భంగం వాటిల్లుతోంది. కొత్త కొత్త ప్రయోగాలతో గిరిజనుల్లో ఆవేదన మిగుల్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గిరిజన సం స్కృతి ప్రతిబింబించేలా రెండేళ్లకోసారి జరిగే జాతర క్రమేణా... హిందూ ధార్మికతవైపు మరలుతోందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న క్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ ముక్తీశ్వర్‌రావు చేసిన ప్రకటన గిరిజనుల్లో మరింత గుబులు రేపుతోంది. రూ.50 కోట్లతో జాతరను సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుస్తామని.. ఆధ్యాత్మిక కేం ద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని ప్రకటించడం గిరిజనుల్లో మరింత గుబులు రేపుతోంది. జాతర అభివృద్ధి సరే కానీ.. సంప్రదాయాలకు భంగం కలిగే చర్యలు ఏవిధంగా ఉంటాయోనన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
క్రమక్రమంగా...
మేడారం జాతర అంటే ఒకప్పుడు దట్టమైన అడవిలో రెండు గద్దెలు మినహా మరేవి ఉండేవి కావు. అక్కడ గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు జరిగేవి. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు చెల్లించేవారు. అయితే క్రమక్రమంగా జాతరకు భక్తుల రాక పెరుగుతూ వచ్చింది. వేల నుంచి లక్షలకు... ఇప్పుడు కోటికి పైగా భక్తులు వచ్చి వనదేవతలను దర్శనం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో సౌకర్యాల మాటున పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. 1996లో మేడారం మహాజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
అంతకుముందే కొద్దిగా మార్పులు జరగగా... దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లాక మార్పుల్లో వేగం పెరిగింది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ.. జాతరను అభివృద్ధి చేయాల్సిన దేవాదాయ శాఖ అందుకనుగుణంగా ముందుకుసాగడం లేదన్న అపవాదును మూటగట్టుకుంది.
1994లో గిరిజనులు వ్యతిరేకించినప్పటికీ భక్తుల సౌకర్యార్థం అంటూ గద్దెల చుట్టూ ఇనుప కంచె (గ్రిల్స్) ఏర్పాటు చేశారు. దీనికి తోడు 2008లో గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీ పేరుతో హిందూ సంప్రదాయం ప్రస్ఫుటించేలా సాలహారం నిర్మించారు. దీనిపై ఆదివాసీ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను తెలిపినా.... కాలక్రమేణా మిన్నకుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ జాతరలో గద్దెల వద్ద డోమ్‌ల నిర్మాణానికి తొలుత ముందుకు వచ్చినా.. గిరిజనుల వ్యతిరేకతతో అధికార యంత్రాంగం వెనక్కి తగ్గక తప్పలేదు.
పెరుగుతున్న లడ్డూ, పులిహోర సంస్కృతి
సమ్మక్క-సారలమ్మ తల్లులకు అత్యంత ఇష్టమైనది బంగారం (బెల్లం). తమ వద్దకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండొద్దని, విలువైన కానుకలు అసలే వద్దని, నిండు మనసుతో కొలిస్తే కోరికలు నెరవేర్చుతామని అమ్మలు చెప్పినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఆ తల్లులకు భక్తులు బంగారంతో మొక్కులు చెల్లిస్తారు. ఈ క్రమంలో బంగారమే ప్రసాదంగా ప్రసిద్ధికెక్కింది. దీంతోపాటు తల్లుల పాదాల చెంత ఉండే పసుపు, కుంకుమలకు ప్రత్యేకత ఉంది. బంగారం.. బొట్టు అందితే అదే మహాభాగ్యం అని భక్తులు భావిస్తారు.
అయితే రానురాను మేడారంలో లడ్డూ.. పులిహోర సంస్కృతి పెరిగిపోయింది. బంగారమే మహా ప్రసాదమైన జాతరలో... ఏకంగా అమ్మల సన్నిధిలోనే లడ్డూ, పులిహోర అమ్మకాలు జరగడం హిందూ సంప్రదాయం వైపు మరలుతోందన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. పూజారుల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే విక్రయాలు జరిపించేందుకు అనుమతులు ఇచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం.
ఆదివాసీల్లో ఆందోళన
అసలే ఆధునికత పేరుతో వస్తున్న మార్పులపై గిరిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో దేవాదాయ కమిషనర్ ముక్తీశ్వర్‌రావు మాస్టర్‌ప్లాన్ అంటూ ఇటీవల బాంబు పేల్చారు. జాతరను ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తామంటూ ప్రకటనలిచ్చేశారు. ఏకంగా వచ్చే జాతర నాటికి రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎటువంటి అభివృద్ధి చేస్తారు.. గిరిజన సంప్రదాయాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఆదివాసీల్లో గుబులు నెలకొంది.
అరుుతే అభివృద్ధి పనులపై గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ పేర్కొనడం వారికి కొంత ఊరటనిచ్చినట్లయింది. కానీ... రూపంలేని అమ్మలకు దేవాదాయ శాఖ అధికారులు రూపాలు కల్పించడం, ప్రచార సాధనాల్లోనూ వాటినే వినియోగిస్తుండడం, పులి, జింకలపై సమ్మక్క-సారలమ్మ ఉన్నట్లుగా ఆలయం ముందు.. పరిసరాల్లోని ముఖద్వారాలపై బొమ్మలను చెక్కించడం... దేవాదాయశాఖ విడుదల చేసిన ఆరాధన మాస పత్రికలోనూ ఇవే బొమ్మలు పెట్టడం వంటి ఘటనలు వారిని నిద్రపట్టకుండా చేస్తున్నారుు.