డొంక కదులుతోంది
Published Tue, Feb 4 2014 3:35 AM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
సాక్షి, ఏలూరు:జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతి డొంక కదులుతోంది. పైలేరియా నివారణ కార్యక్రమం కోసం కేటాయించిన నిధులను ఆ శాఖ అధికారులు గోల్‌మాల్ చేసిన వైనాన్ని వరుస కథనాలతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. గతనెల 28, 29, 30 తేదీల్లో జిల్లా మలేరియా అధికారి ఆధీనంలో పైలేరియా నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం విడుదలైన రూ.26 లక్షల నిధుల వినియోగంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశం మేరకు జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు సోమవారం విచారణ జరిపారు. తొలుత ఆయన డీఎంహెచ్‌వో కార్యాలయంలోని జిల్లా మలేరియా అధికారి విభాగానికి వెళ్లగా, అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. బుట్టాయగూడెం మండలం కేఆర్ పురంలోని మలేరియా విభాగంలో అటెండర్ మినహా సిబ్బంది లేరని తెలుసుకుని వెంటనే రెండు కార్యాలయాలకు తాళాలు వేసి, సీజ్ చేరుుంచారు.
ట్రెజరీ లావాదేవీలు నిలిపివేత
పైలేరియూ నిధులకు సంబంధించి నగరంలోని ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా చేసిన లావాదేవీల వివరాలను జేసీ సేకరించారు. బ్యాంక్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఈ మేరకు బ్యాంకు అధికారికి లేఖ ఇచ్చారు. డీఎంవో కార్యాలయాని సంబంధించి ఎటువంటి బిల్లులు చెల్లించవద్దని ట్రెజరీకి ఆదేశాలిచ్చారు.
డీఎంహెచ్‌వో, డీఎంవో వాంగ్మూలం నమోదు
సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ డీఎంహెచ్‌వో టి.శకుంతల, డీఎంవో నాగేశ్వరావులను జేసీ తన కార్యాలయంలో విచారించారు. ఈ ఇద్దరు అధికారులు జేసీ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. తప్పులను ఒకరిపై ఒకరు నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో జేసీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకే రోజు రూ.26.31 లక్షలు డ్రా చేశారు
ఐసీఐసీఐ బ్యాంకునుంచి గత నెల 28న రూ.26.31 లక్షలను డీఎంహెచ్‌వో, డీఎంవో డ్రా చేసినట్లు విచారణలో తేలింది. వీటిలో పైలేరియా నిధులు రూ.24.56 లక్షలు కాగా, రూ.1.75లక్షలు మరో కార్యక్రమానికి సంబంధించిన నగదు అని తేల్చారు. త మొత్తంలో రూ.15.85 లక్షలను ఆన్‌లైన్ ద్వారా పీహెచ్‌సీలకు, క్లస్టర్లకు, పురపాలక సంఘాలకు పంపించారు. మిగిలిన రూ.10.46 లక్షలను అధికారులు తమవద్దే ఉంచుకున్నారు. ఇందులో రూ.4 లక్షలు డీఎంహెచ్‌వో వద్ద, రూ.1 లక్ష సూపరింటెండెంట్ వద్ద, సుమారు రూ.3 లక్షలు తన వద్ద ఉన్నట్టు డీఎంవో వివరించారు. తాను డబ్బులు తిరిగి కట్టేస్తానంటూ రూ.3.10 లక్షలను జేసీ సమక్షంలో ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. డీఎంహెచ్‌వో శకుంతల మాత్రం తన వద్ద ఏ సొమ్మూ లేదని, నాగేశ్వరావు, రాథోడ్ అనే మరో వైద్యుడు కలిసి నగదు వ్యవహారం చూసుకున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే విభాగాధిపతిగా ఆమె చెప్పినట్టే తాము నడుచుకున్నామని డీఎంవో చెప్పారు.
తప్పు జరిగింది : జేసీ
వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలపై విచారణ జరిపామని, పైలేరియూ నిధుల విషయంలో తప్పు జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని జేసీ బాబూరావు నాయుడు ‘సాక్షి’కి చెప్పారు. అంత పెద్ద మొత్తాన్ని బ్యాంకు నుంచి నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేయకూడదన్నారు. అంతేకాకుండా డ్రా చేసిన సొమ్మును నగదు రూపంలో ఉంచడం తప్పిదమన్నారు. కనీసం సొమ్మును చెక్కుల రూపంలో కూడా ఉంచకపోవడం మరో తప్పన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లెక్కలు సరిగ్గా లేవని వివరించారు. విచారణను మంగళవారం పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని జేసీ చెప్పారు.
Advertisement