శనివారం గుంటూరు జీజీహెచ్ అత్యవసర విభాగం వద్ద మృతి చెందిన మహిళ ఆత్మఘోష
కళ్లు మూతలు పడుతున్నాయి. కాలు భూమిపై నిలవడం లేదు.. ఎవరో మా బంధువులు నా శరీరాన్ని మూటలా ఆటోలో వేసుకుని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అవయవాలు సరిగా పని చేయడం లేదని తెలుస్తూనే ఉంది. నాతో వచ్చిన వారికి ఎక్కడ వైద్యం చేస్తారో తెలియక కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నారు.. ఎవరూ దయ చూపలేదు. జీవచ్ఛవంలా మారిన నన్ను పడుకోబెట్టడానికి స్ట్రెచర్లు కూడా లేవు. నేలపైనే ఓ మూలన పడేశారు.. నా ఎదురుగా వెళుతున్న వారి వంక నా కళ్లు ఆశగా చూస్తున్నాయి. ఒక్కరికైనా కనికరం కలుగుతుందని.. సాయంత్రమైంది.. డాక్టర్ల జాడ లేదు.. నా గొంతులో గుటక పడడం లేదు. ఎవరినైనా పిలుద్దామన్నా మాట రావడం లేదు.. జీవంతో కట్టెగా ఉన్న నా శరీరాన్ని రాత్రంతా దోమలు ఆవాసంగా మార్చుకున్నాయి. తెల్లవారింది.. ఈ రోజైనా డాక్టర్లు పట్టించుకుంటారని నా నవనాడుల్లో ఏదో మూల ఉన్న ఆయువుకు ఆశ కలిగింది. మధ్యాహ్నం వేళకు కూడా నా వైపు కన్నెత్తి చూసిన దిక్కు లేదు.. అయ్యా కనికరించండయ్యా అని కాళ్లు పట్టుకుందామనుకున్నాను.. చచ్చుబడిన నా చేతులు పైకి రాలేదు.. పైకి వినబడని గుండె రోదనకు కళ్లలో నీళ్లు ధారలవుతున్నాయి. మళ్లీ రాత్రికి దోమలే నాకు మిత్రులయ్యాయి. మూడో రోజు నా శరీరంలో అవయవాలన్నీ పని చేయడం మానేశాయి. నోట్లో నుంచి రక్తం బొట్లు రాలుతున్నాయి. అప్పుడూ వైద్యులు, వైద్య సిబ్బంది నా శరీరం మీదుగా నడిచి వెళుతూనే ఉన్నారు.. కడుపులో ప్రాణం కళ్లలో నుంచి వెళ్లిపోయింది. నా శరీరం నిర్జీవంగా మారింది.. ప్రభుత్వాస్పత్రి నిర్దయకు బలైన మృతుల్లో నా శవమూ చేరింది. అప్పుడు నా ఆత్మరోదన నాకు మాత్రమే వినిపించింది.. అయ్యా.. మాలాంటి బక్కచిక్కినోళ్లకు మీరే దేవుళ్లు.. కాస్తంత మానవత్వంతో మమ్మల్ని మనుషులుగా చూడండయ్యా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా వేడుకుంది.
గుంటూరు ఈస్ట్: జీజీహెచ్ అత్యవసర విభాగం వెయిటింగ్ హాలులోని జనరిక్ మెడికల్ షాపు వద్ద 3 రోజులుగా అస్వస్థతతో పడి ఉన్న సుమారు 40 ఏళ్ల మహిళ శనివారం మృతి చెందింది. 3 రోజులుగా మహిళ అస్వస్థతతో నేల మీద పడి ఉన్నా వైద్యులుగానీ, వైద్య సిబ్బందిగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. రోగి సహాయకులు వేడుకున్నా వైద్య సిబ్బంది కనికరించ లేదు. ప్రాంగణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు,సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఎవరూ మహిళను పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన మూడో రోజుకు ఆమె ప్రాణాలు వదిలింది.
మరో వ్యక్తి బలి
విషయం తెలిసిన మీడియా సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లిన అనంతరం మరో వ్యక్తి ఇదే దుస్థితిలో కనిపించాడు. నాలుగు రోజులుగా ఆసుపత్రి మెయిన్‌గేటు లోపల పడి ఉండటాన్ని గుర్తించారు. విషయాన్ని ఆర్‌ఏంవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ రోగిని అత్యవసర విభాగంలోకి తరలించారు. వైద్యం ప్రారంభించిన కొంతసేపటికి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
ప్రాథమిక చికిత్సతో సరి
ఈ ఏడాది ఏప్రిల్ నెల 11వ తేదీ రంగనాథ్ అనే వ్యక్తి చికిత్స కోసం జీజీహెచ్ అత్యవసర విభాగానికి వస్తే సహాయకుడు లేడని బయటకు పంపించేశారు. రంగనాథ్ 3 రోజులు అస్వస్థతతో మెయిన్ గేటు సమీపంలోనే మృతి చెందాడు. 8 గంటలపాటు మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించకుండా వదిలేశారు. మీడియా దృష్టికి వెళ్లడంతో అప్పుడు స్పందించారు. నవంబర్ 5వ తేదీ సత్యనారాయణ అనే రోగి ముఖానికి దెబ్బతగలడంతో అత్యవసర విభాగానికి వచ్చాడు. అతనికి ప్రాథమిక చికిత్స చేసి అసిస్టెంట్ సర్జరీ విభాగంలో ఉంచారు. నోటి నుంచి తీవ్ర రక్త స్రావమవుతున్నా ఆరు గంటలపాటు పట్టించుకోలేదు. అక్టోబర్ 23వ తేదీ పల్లపు నాగేశ్వరావు అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం రోగిని వదిలేశారు. రోగులు ఆందోళన చేయడంతో డిశ్చార్జ్ రాశారు. అనంతరం ఆర్‌ఎంవో కలుగచేసుకోవడంతో తిరిగి వైద్యం కొనసాగించారు. ఇటువంటి సంఘటనలు అత్యవసర విభాగంలో తరచూ పునరావృతమవుతున్నాయి.
మానవ సేవకు మంగళం
కన్నబిడ్డలు నిరాదరణ, రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు స్థానికుల సహాయంతో అత్యవసర విభాగానికి వస్తుంటారు. వైద్య సిబ్బంది సహాయకులు లేకపోవడంతో ప్రాథమిక చికిత్స చేసి వార్డుల్లో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నవారిని ప్రాథమిక చికిత్స చేసి ఓ మూల స్టెచ్చర్ మీదే వదిలేస్తున్నారు. కనీసం మంచి నీరు, అల్పాహారం కూడా అందక వారు మృతి చెందుతున్నారు. అనంతరం గుర్తు తెలియని మృతుల జాబితాలో వేసి మార్చురీకి తరలిస్తున్నారు. గతంలో ఆస్పత్రిలో మానవ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా అనాథలకు కొందరు సేవ చేసేవారు. వారికి అండగా ఉండి వైద్యం అందేలా చేసేవారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి అధికారులు అటకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment