కల్వకుర్తి, న్యూస్‌లైన్: ‘ఒక్కగానొక కొడుకు.. ఎవరికి ఏ పాపం చేసి ఎరుగం. దేవుడా బతికించు!’ అంటూ వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్లి దుండగుల చేతిలో హత్యాయత్నానికి గురైన కల్వకుర్తి విద్యార్థి సాయిప్రసాద్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలుసుకుని తీవ్ర మనోవేదన చెందుతున్నారు. పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిప్రసాద్‌ను స్థానికులు ప్రాథమిక చికిత్స కోసం మొదట స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.
మెరుగైన వైద్యం కోసం సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. సాయిప్రసాద్ దేహం 70శాతం కాలిపోవడంతో ఊపిరితిత్తులతో పాటు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో శ్వాస తీసుకునేందుకు అతను తీవ్రఇబ్బంది పడుతున్నట్లు అతని బంధువులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్యానికి అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు, బంధువులను ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు. ఇప్పటివరకు సాయిప్రసాద్ తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మతో పాటు, మిత్రుడు సుభాష్‌ను మాత్రమే చూసేందుకు అనుమతించారు. కొడుకును ప్రత్యక్షంగా చూసేందుకు అతని తల్లిదండ్రులను సైతం అనుమతించకపోవడంతో ఆరోగ్య పరిస్థితి తెలియక తల్లడిల్లుతున్నారు.
కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి సాయిప్రసాద్‌ను చూసేందుకు వెళ్లినవారికి ఆస్పత్రి వర్గాల నుంచి అనుమతి లభించకపోవడంతో ఇంటిముఖం పట్టారు. తీవ్రంగా గాయపడిన సాయిప్రసాద్‌కు డయాలిసిస్ చేస్తున్నారు. అయితే శరీరంలోని అవయవాలు సహకరించకపోవడంతో అతని ఆరోగ్యం కుదుటపడటంలేదని వైద్యులు చెబుతున్నారని, అతని చూసేందుకు వెళ్లిన కొందరు ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. మూడురోజులుగా ఆరోగ్యపరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంపై అతని కుటుంబసభ్యులు తీవ్రంగా కలత చెందుతున్నారు.
అనంతపురంతో ప్రత్యేక అనుబంధం
సాయిప్రసాద్‌కు అనంతపురం జిల్లాకు చెందిన వారితో ప్రత్యేక అనుబంధం ఉంది. అతని చిన్నాన్న వ్యవసాయశాఖలో అదే జిల్లాలో ఏడీగా పనిచేస్తున్నారు. అలాగే బెంగళూరులో తన మిత్రులు మెడిసిన్ చదువుతున్నారు.
వేసవి తదితర సెలవులు వచ్చిన ప్రతిసారి సాయిప్రసాద్ తన మిత్రులతో కలిసి వారి ఇళ్లకు వెళ్లడం, వారిని హైదరాబాద్‌లోని తన ఇంటికి తీసుకురావడం చేసేవాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సాయిప్రసాద్‌కు అనంతపురం జిల్లాకు చెందిన వారే అన్ని తామై చూసుకుంటున్నారు. ఆ జిల్లాకు చెందిన విద్యార్థులు సైతం అతని చూసేందుకు ఆస్పత్రికి తరలొచ్చారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మిత్రుడిని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.
దేవుడా..బతికించు!
Published Sat, Nov 16 2013 3:46 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement