మందులేవి మహాప్రభో? | Medicine Shortage In Government Hospital | Sakshi
Sakshi News home page

మందులేవి మహాప్రభో?

May 9 2019 8:51 AM | Updated on May 9 2019 8:52 AM

Medicine Shortage In Government Hospital - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సర్కారీ ఆస్పత్రుల్లో మందుల సరఫరా పూర్తిగా గాడి తప్పింది. ఆపత్సమయంలో ఆదుకునే మందులూ కరువయ్యాయి. ఏ ఆస్పత్రికి వెళ్లినా జబ్బు నయం చేసే మందులు కనిపించడం లేదని రోగులు వాపోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలతో వడదెబ్బకు జనం పిట్టల్లా పడిపోతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు తీసుకెళితే తక్షణమే కోలుకునేందుకు ఇవ్వాల్సిన సెలైన్‌ బాటిళ్లకూ దిక్కులేకుండా పోయింది. వడదెబ్బతో కొందరు, మంచి నీరు లభించక కలుషిత నీరు తాగి డయేరియాతో మరికొందరు ఇలా లెక్కకు మించి బాధితులు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. వీరికి తక్షణమే సెలైన్‌ ఎక్కించి వారిని ముందు కోలుకునే విధంగా చేయాలి. అయితే.. వచ్చిన ప్రతి రోగికి ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) మాత్రమే ఇస్తున్నారు.

దీంతో రోగులు కోలుకోలేకపోతున్నారు. ‘సెలైన్‌ కావాలంటే బయట తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రుల సిబ్బంది తెగేసి చెబుతుండటంతో బాధితుల బాధ వర్ణనాతీతం. పేదల మందులకు వెచ్చించాల్సిన రూ.140 కోట్లను ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పసుపు–కుంకుమ పథకానికి తరలించి రోగుల ప్రాణాలతో ఆడుకుంటోంది.530 రకాల వరకు మందులు ఉండాల్సి ఉన్నా..: పావలా ఖరీదు కూడా చేయని పారాసెటమాల్‌ మందులు కూడా ఆస్పత్రుల్లో లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. అంతుచిక్కని జ్వరాలతో ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. వారికి తక్షణమే పారాసెటమాల్‌ ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా లేవు. రెండ్రోజుల క్రితమే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌కు వచ్చాయని చెబుతున్నా అవి ఇంతవరకూ ఆస్పత్రులకు సరఫరా కాలేదు. గత కొన్ని నెలలుగా ఏఆర్‌వీ మందులు అందుబాటులో లేకపోయినా పట్టించుకునే నాథుడే లేరు. ఈఎంఎల్‌ (ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ లిస్ట్‌) జాబితాలో 530 రకాల మందుల వరకూ ఉండాలి. కానీ బోధనాస్పత్రుల్లోనే 150 రకాల మందులకు మించి లేవు. అంటే.. 70 శాతానికి పైగానే మందులు అందుబాటులో లేవు. 



ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ..: వాస్తవానికి.. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఈ మందులను సరఫరా చేయాలి. ఈ సంస్థ తమకు ఆస్పత్రుల నుంచి మందులు కావాలని సమాచారం రాలేదంటోంది. ఆస్పత్రులేమో తాము పంపించినా మందులు ఇవ్వలేదని చెబుతున్నాయి. ఇలా ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. దీంతో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక గాయమై ఆస్పత్రులకు వస్తే కట్టు కట్టడానికి కనీసం బ్యాండేజీ, గాయాన్ని శుభ్రం చేయడానికి దూది కూడా లేదు. తాము ఎన్నిసార్లు మందుల గురించి అడిగినా పట్టించుకోవడం లేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. చివరకు పేద రోగుల మందులకు వెచ్చించాల్సిన రూ.140 కోట్ల నిధులను పసుపు–కుంకుమకు మళ్లించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి చోట్ల పెద్దాస్పత్రుల్లో మందుల కొరత తక్షణమే తీర్చాలని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ)కి లేఖలు రాసినా ఫలితం శూన్యం. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ ప్రస్తుతం సెలవులో ఉండటంతో ఆయనకు బదులుగా దీన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

కొరత ఉన్న మందులు వచ్చాయి
ఇటీవల పారాసెటమాల్, యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో లేని మాట వాస్తవమే. అయితే.. మొన్ననే ఆ మందులు పంపించారు. మిగతా మందుల కొరత గురించి నా దృష్టికి రాలేదు. కొన్ని మందులు అందుబాటులో లేకపోవడంతో పక్క జిల్లాల నుంచి తెప్పించుకున్నాం. అలాంటిదేదైనా ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటాం. – డా.దుర్గాప్రసాద్, కమిషనర్, వైద్యవిధాన పరిషత్‌

మందుల కొరత నా దృష్టికి రాలేదు
నేను సోమవారం చాలా బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లతో మాట్లాడాను. ఎవరూ ఎక్కడా మందుల కొరత ఉందని నాతో చెప్పలేదు. ఐవీ ఫ్లూయిడ్స్‌ కొరత కూడా లేదు. ఏదైనా ఒకటో అరో ఖరీదైన మందులు లేకపోవచ్చుగానీ, రొటీన్‌గా వాడే అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. – డా.కె.బాబ్జీ, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement