సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోని 13 జిల్లాలకు వారధిగా ఉన్న గుంటూరు నగరాన్ని మెగా సిటీగా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయవాడలో గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గుంటూరు నగరానికి సంబంధించి పలు విషయాలను చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వివరించారు. వీటిలో ప్రధానాంశాలను పరిశీలిస్తే...
ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు గంటపాటు చేసిన ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వ ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. ముఖ్యంగా నూతన రాష్ట్రంలో అభివృద్ది పరిచే నాలుగు మెగా సిటీల్లో గుంటూరు ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు నగర మాస్టర్ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు సంబధించి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సమగ్ర నివేదిక అందజేసినట్లు సమాచారం.
ప్రధానంగా నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది. గుంటూరు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెగా సిటీగా అభివృద్ధి పరిస్తే, ప్రపంచ బ్యాంకు ద్వారా చేపట్టిన రూ. 460 కోట్ల సమగ్ర తాగునీటి పథకాన్ని తక్షణం పూర్తి చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, సాగునీటి రంగాలకు సంబధించి అంశాలను ప్రత్యేకంగా వివరించారు.
పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు గల సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ కోరినట్టు తెలుస్తోంది.
ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వీలుగా రహదారుల విస్తరణ చేపట్టడం తో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రణాళికతో ప్రత్యేక నివేదిక అందజేసినట్లు తెలిసింది.
జిల్లాలోనే రాజధాని ఏర్పడబోతోందన్న వార్తల నేపథ్యంలో భూముల లభ్యతపై సీఎంకు వివరించారని సమాచారం. జిల్లాలో ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు, సౌర విద్యుత్ ప్లాంటు నెలకొల్పేందుకు గల అవకాశాలను వివరించారు.
మెగా సిటీగాగుంటూరు
Published Fri, Aug 8 2014 12:05 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement