బద్వేలు : జిల్లాలో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలో 51 మండలాలకుగాను కేవలం 7 మండలాలకు మాత్రమే మండల విద్యాశాఖాధికారులు ఉన్నారు. 44 మండలాల్లో ఇన్‌ఛార్జి ఎంఈఓలతో కాలం గడపాల్సి వస్తోంది. వీరికి సరైన సిబ్బందిని కేటాయించకపోవడంతో కేవలం కార్యాలయ పనులకే పరిమితమవుతున్నారు. జిల్లాలో కేవలం కడప, బద్వేలు, సుండుపల్లి, చిట్వేలి, కొండాపురం, ఖాజీపేట మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన చోట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు ఈ బాధ్యతలు అప్పగించారు.
4.7లక్షల చిన్నారుల బాధ్యత వారిదే
జిల్లాలో ప్రస్తుతం 4,493 పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ గత గురువారం తెరుచుకున్నాయి. వీటిలో 3,122 ప్రాథమిక పాఠశాలలు, 562 ప్రాథమికోన్నత పాఠశాలలు, 790 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలోనే 323 ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు, 323 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 4.7 లక్షల మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 2.4 లక్షల మంది బాలురు కాగా 2.3 లక్షల మంది బాలికలు ఉన్నారు. వీరందరి పర్యవేక్షణలో ఎంఈఓలదే కీలకపాత్ర. పాఠశాలల నిర్వహణ, నిధుల వినియోగం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, తదితర విషయాలను గమనించడం కూడా ఎంఈఓల విధే.
ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం
ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణ కూడా ఎంఈఓలే చూడాల్సి ఉంది. కానీ ఎక్కువ మండలాల్లో ఇన్‌ఛార్జీలు ఉండటంతో దీనిపై వారు శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. స్కూలు వాహనాలు పాతవి వినియోగిస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదు. ఈ వాహనాలను విద్యార్థులను తీసుకొచ్చేందుకు వినియోగించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 15 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. అలాగే పలు పాఠశాలల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలు కనిపించడం లేదు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించడం లేదు. ఫైరింజన్ వెళ్లేందుకు కూడా స్థలం లేకుండా గదులు నిర్మిస్తున్నారు. ఎంఈఓల పర్యవేక్షణ ఉంటే వీటన్నింటినీ కూడా విద్యాసంస్థలు పాటిస్తాయి.
పని భారంతో ఒత్తిడి
ఇన్‌చార్జి బాధ్యతలతో ఎంఈఓలపై పని భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా ఎంఈఓలు ఉపాధ్యాయుల జీతభత్యాలు, సర్వీస్ రిజిస్ట్రర్ల నిర్వహణ, సెలవుల మంజూరు వంటి విషయాలను పర్యవేక్షించాలి.
ఒక్కో మండలంలో 60-80 వరకు పాఠశాలలు, 150 వరకు ఉపాధ్యాయులు ఉంటారు. అదనపు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఈ బాధ్యతలన్నీ ఎంఈఓలే చేయాల్సి వస్తోంది. రోజూ రెండు పాఠశాలలను పర్యవేక్షిస్తే కానీ మండలంలోని అన్ని పాఠశాలలను నెలకొకసారి తనిఖీ చేయలేరు. ఎంఈఓలకు అదనపు సిబ్బంది లేకపోవడంతో ఈ విధులు నిర్వర్తించలేకున్నారు. 44 మండలాల్లో పలు ఉన్నతపాఠశాలల హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరు తమ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు ఎంఈఓ బాధ్యతలను నిర్వర్తించడం కష్టసాధ్యం. అదనపు సిబ్బంది చేయాల్సిన పనులను పలు చోట్ల ఉపాధ్యాయులతో చేయిస్తున్నారు. దీంతో వీరు ఎంఈఓలను ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితి పలు మండలాల్లో ఉంది.
ప్రాథమిక పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో జిల్లాలో గత ఏడాది వంద వరకు ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలను నియమించి, ఇతర పనులు నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని కేటాయించాలని పలువురు కోరుతున్నారు. అప్పుడే పాఠశాలలపై ఎంఈఓలు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయగలరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎంఈఓలు కావలెను
Published Wed, Jun 18 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement