ఒంగోలు మెప్మా కార్యాలయం
సాక్షి, చీరాల: మెప్మాలో అవినీతి రాజ్యమేలుతోంది. పేద మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. రుణం పేరుతో కాసుల వసూలుకు దిగి పొదుపు మహిళలను దగా చేస్తున్నారు. మీకు రుణం ఇస్తే.. మాకేమి ఇస్తారంటూ.. పొదుపు మహిళలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పొదుపు సంఘాల అధ్యక్షుల ద్వారా రిసోర్సు పర్సన్లే ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని చీరాల మున్సిపాలిటీతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఇదే తంతు నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితి ఏర్పడి పేద, బడుగు వర్గాలతో పాటు అన్ని వర్గాల పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఇందులో ముఖ్యంగా సగటు జీవులు నానా అవస్థలు పడుతున్నారు. దారిద్య్రరేఖ దిగువ ఉన్న వారికి కరోనా కష్టాలు తెచ్చి పెట్టింది. (కరోనా.. కాలయములైన కజిన్స్)
దినసరి కూలీలు, వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు ఇందులో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి వారిని ఆదుకునేందుకు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చేయూత ఇచ్చింది. ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలతో పాటు రెండు నెలల కాలంలో నాలుగు దఫాలుగా ఉచితంగా రేషన్ అందించింది. దీంతో పాటు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీని అందించడంతో పాటు ప్రధానంగా ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని చెల్లిస్తున్న పొదుపు సంఘాల వారికి కరువు రుణం పేరుతో ప్రతి గ్రూపునకు రూ.50 వేలు చొప్పున రుణం ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. కరువు కాలంలో పొదుపు సంఘాలను ఆదుకుంటే ఆయా కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావించింది. (‘గూగూల్ ప్రణాళికల కోసం ఉద్యోగులు కలిసిరావాలి’)
జిల్లాలోని సగానికిపైగా పొదుపు సంఘాలకు రూ.50 వేలు చొప్పున రుణ సౌకర్యం కల్పించింది. జిల్లాలో అద్దంకి, చీమకుర్తి, చీరాల, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో 10,980 పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 300 నుంచి 400 గ్రూపుల వరకు రూ.50 వేలు చొప్పున కరువు రుణాలు అందించారు. మిగిలిన వాటికి కూడా రుణం ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా నిబంధన నేపథ్యంలో బ్యాంకర్లు ఇళ్ల వద్దకే వచ్చి రుణాలు అందిస్తున్నారు. కరువు రుణాల్లో కూడా మెప్మా సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చీరాల మున్సిపాలిటీలో రూ.50 వేల రుణం తీసుకున్న గ్రూపుల అధ్యక్షుల వద్దకు వెళ్లి మీకు రుణం ఇచ్చాం.. మాకు గ్రూపులో ఉన్న పది మంది కలిసి రూ.2 వేలు చొప్పున చెల్లించాలని, ఇతర అధికారులకు తాము ఇవ్వాలని కొంతమంది రిసోర్సు పర్సన్లు రుణం ఇచ్చిన రోజే నగదు వసూలు చేశారు.
పొదుపు సంఘాల మహిళలకు వారి వాటాకు వచ్చిన రూ.5 వేలలో రూ.200 చొప్పున వసూలు చేయడం ఏమిటని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో ఏదైనా రుణం కోసం వస్తే ఇబ్బందులు పెడతారని వెనకడుగు వేస్తున్నారు. ఉదాహరణకు చీరాల మున్సిపాలిటీలో 1500 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి రూ.2 వేలు చొప్పున వసూలు చేస్తే రూ.3 లక్షలు వసూలవుతాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే తంతు జరగుతుంటే మెప్మాలో పొదుపు మహిళలను ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో తెలుసుకోవచ్చు.
గతంలోనూ ఇదే తంతు
చీరాల మున్సిపాలిటీలో గతంలోనూ ఇదే విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. చీరాలలో రెండు మహిళా సంఘాల పేరుతో రుణం ఇచ్చినట్లు నమోదు చేసి లక్షల రూపాయలు స్వాహా చేశారు. పేద మహిళల పిల్లలకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు కూడా ఇవ్వలేదు. దీంతో చీరాల తరహాలో ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాల్లో మెప్మా తీరుపై ఆరోపణలు వచ్చాయి. చీరాలలో జరిగిన వ్యవహారంపై పోలీసు విచారణ కూడా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment