సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు ఫలక్‌నుమా వరకే ప్రతిపాదించిన ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టు మార్గాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. దీనిప్రకారం సుమారు రూ.3,275 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 15 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. ఇప్పటివరకు జూబ్లీబస్‌స్టేషన్-ఫలక్‌నుమా వరకు మాత్రమే మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయం విదితమే. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-శిల్పారామం కారిడార్లలోనూ మెట్రో పనులు జరుగుతున్నాయి. తాజా నిర్ణయంతో మెట్రో ప్రాజెక్టు నిడివి 72 కిలోమీటర్ల నుంచి 87 కిలోమీటర్లకు పెరిగే అవకాశాలున్నట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
విమాన ప్రయాణికులకు ఉపశమనం
నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వ్యక్తిగత వాహనాలున్నవారు మినహా మిగతా వారు క్యాబ్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ రూట్లో మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వస్తే వేలాదిమంది నగరం నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు తక్కువ ఖర్చుతో చేరుకునే అవకాశం లభించనుంది.
మెట్రో వ్యయం ఇలా..
ప్రపంచంలో అతిపెద్ద పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రాజెక్టుగా పేరొందిన మెట్రోకు ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.12,674 కోట్లు వ్యయం చేస్తుందని హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందులో 30 శాతం నిధులను ఎల్‌అండ్‌టీ సంస్థ సొంత మూలధనం నుంచి వెచ్చిస్తుందని, మిగతా 70 శాతం నిధులను జాతీయ బ్యాంకుల నుంచి సేకరించే రుణాల ద్వారా సమీకరిస్తుందని చెప్పారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.1458 కోట్ల నిధులు వ్యయం చేయనుందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. భూసేకరణ, పునరావాసం, రహదారుల విస్తరణ, పైప్‌లైన్ల మార్పు, ఇతర వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3275 కోట్లు పెరిగిందని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఎల్‌అండ్‌టీ చేయనున్న వ్యయంపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ‘మెట్రో’ రైలు
Published Fri, Sep 20 2013 11:30 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement