
మెట్రోకు రూ.4 వేల కోట్లు
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ప్రాథమికంగా అంగీకరించిన జపాన్ ఇంటర్నేషనల్ ...
రుణం ఇచ్చేందుకు జపాన్ బృందం ఓకే
రెండోసారి నగరంలో పర్యటించిన జైకా బృందం
విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ప్రాథమికంగా అంగీకరించిన జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ బ్యాంకు (జైకా) ప్రతినిధి బృందం రెండోసారి నగరంలో పర్యటించింది. ఈ అధ్యయన బృందానికి ఇకెజమి నేతృత్వం వహించగా, సోనొబె, ఫుకునగ, త్సుజి సభ్యులుగా రెండు కారిడార్లను చూశారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి ఏలూరు, బందరు రోడ్డు కారిడార్లను చూపించి ఎక్కడెక్కడ స్టేషన్లు వస్తాయో వివరించారు. ప్రధాన స్టేషన్ ఏర్పాటుచేసే పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్‌తో పాటు నిడమానూరు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రదేశాలకు తీసుకెళ్లి వాటి గురించి తెలియజేశారు.
ఆ తర్వాత వారితో సమావేశమైన రామకృష్ణారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6,780 కోట్ల వ్యయమవుతుందని, అందులో 80 శాతాన్ని రుణంగా అడిగిన విషయం గురించి చర్చించారు. సుమారు రూ.4,250 కోట్ల రుణం ప్రభుత్వం తరఫున ఏఎంఆర్‌సీ అడుగుతుండగా రూ.4 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రాథమికంగా జైకా సభ్యులు ఈ సమావేశంలో అంగీకరించినట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా రుణాన్ని విడుదల చేయాలని ఏఎంఆర్‌సీ కోరగా ఆరు నెలల్లో మొదటి విడత మొత్తాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అధ్యయన బృందం తెలిపింది.