ఎంజీఎంలో ఆక్సీజన్ దందారూ35.29 లక్షలు స్వాహా | MGM oxygen dandaru 35.29 million Swaha | Sakshi
Sakshi News home page

ఎంజీఎంలో ఆక్సీజన్ దందారూ35.29 లక్షలు స్వాహా

Published Mon, Nov 11 2013 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

MGM oxygen dandaru 35.29 million Swaha

 

= రూ. 2 కోట్ల దోపిడీకి అదనం   
 =సిలిండర్ల అద్దె పేరిట మోసం    
 =ఆలస్యంగా తేరుకున్న అధికారులు

 
 రోగుల ప్రాణాలు కాపాడే ఆక్సీజన్...ఎంజీఎం ఆస్పత్రిని పీల్చి పిప్పి చేస్తోంది. అధిక ధరతో ఆరేళ్లపాటు అడ్డగోలుగా దోచుకున్న సంబంధిత కాంట్రాక్టర్ అద్దె పేరిట మరో మోసానికి ఒడిగట్టాడు. రూ. 2 కోట్లు చాలవన్నట్లు మరో రూ. 35.29 లక్షలను గుటకాయ స్వాహా చేశాడు. బిల్లులు చెల్లించేటప్పుడు కళ్లు మూసుకున్న అధికారులు చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరించడం కొసమెరుపు.
 
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉత్తర తెలంగాణలో పెద్దాస్పత్రిగా పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) హాస్పిటల్‌లో చోటుచేసుకున్న ఆక్సీజన్ సిలిండర్ల దందాలో మరో కోణం వెలుగు చూసింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 230కే ఆక్సీజన్ సిలిండర్‌ను సరఫరా చేసిన కాంట్రాక్టర్... ఎంజీఎం ఆస్పత్రికి రూ. 385 చొప్పున అంటగట్టిన వైనం ఇప్పటికే బట్టబయలైంది. ఒక్కో సిలిండర్‌పై రూ. 155 చొప్పున సర్కారుకు నష్టం వాటిల్లింది. ఆరేళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ దందాతో రూ. 2 కోట్లకు పైగా పక్కదారి పట్టాయి. కాంట్రాక్టర్... అందరి కళ్లకు గంతలు కట్టి అడ్డగోలుగా దోచుకున్న బాగోతాన్ని ఈ ఏడాది మే నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజాగా మరో నిర్వాకం బయటపడింది. ఆక్సీజన్ సిలిండర్లకు అడ్డగోలు రేటు పెట్టిన ఎంజీఎం పాలనా యంత్రాం గం... అదీ చాలదన్నట్లు రోజుకు రూ. 26 చొప్పున అద్దె కూడా చెల్లించింది. దీంతో ఈ కుంభకోణం విలువ మరింత పెరిగింది.
 
ధ్రువీకరించిన ఎంజీఎం సూపరింటెండెంట్

రేటులో గిమ్మిక్కు చేసి... నిండా ముంచిన ఏజెన్సీకి అద్దె పేరిట మ రో రూ. 35.29 లక్షలు అప్పనంగా చెల్లించినట్లు లెక్కతేలడంతో ఏం చే యాలో పాలుపోక ఎంజీఎం అధికారులు తల పట్టుకుంటున్నారు. అక్రమంగా అద్దె పేరిట బిల్లులు  తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని.. భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజనాకు నష్టం వాటిల్లిందని స్వ యానా ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇటీవల సదరు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ఆక్సీజన్ కొనుగోలులో భారీ మొత్తమే పక్కదారి పట్టినట్లు మరోసారి రూఢీ అయింది.
 
2007 నుంచి చెల్లించిన అద్దె రూ. 35,29,344

ఎంజీఎంలో సగటున రోజుకు 70 నుంచి 80 ఆక్సీజన్ సిలిండర్లు అవసరమవుతాయి. 2007 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఆస్పత్రి రికార్డుల ప్రకారం మొత్తం 1,35,744 సిలిండర్లు సరఫరా అయ్యాయి. 2007-08లో 2,794 సిలిండర్లు, 2008-09లో 11,522, 2009-10లో 20,858, 2010-11లో 36,028, 2011-12లో 35,762, 2012-13లో 28,780 సిలిండర్లు కొనుగోలు చేశారు. హన్మకొండకు చెందిన తులసి ఏజెన్సీ వీటిని సరఫరా చేసింది. వీటికి మొత్తంగా రూ. 35,29,344 అద్దె చెల్లించినట్లు ఆస్పత్రి అధికారులు ధ్రువీకరించారు. బిల్లులు చెల్లించేటప్పుడు కళ్లు మూసుకున్న అధికారులు ఇప్పుడు రికవరీకి తంటాలు పడుతుండడం గమనార్హం.
 
ఆది నుంచీ వివాదాస్పదమే...


ఎంజీఎంలో ఆక్సీజన్ కొనుగోలు ముందు నుంచీ వివాదాస్పదంగానే ఉంది. సర్కారు ఆస్పత్రి కావడంతో రేట్లను ఎవరూ పట్టించుకోరనే ధీమాతో సదరు కాంట్రాక్టర్ గిమ్మిక్కులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఆరేళ్ల తర్వాత రేట్లలో ఉన్న తేడా బయటపడడంతో మే నెలలో ఎంజీఎం అధికారులు హడావుడిగా ఫైళ్లు కదిపారు. అప్పటి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆస్పత్రిలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రూ. 230కే సిలిండర్లను కొనాలని తీర్మానించారు. మౌఖికంగా రేటును తగ్గించేందుకు అంగీకరించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇప్పటికీ పద్ధతి మార్చుకోలేదని... పాత రేటు ప్రకారమే బిల్లులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవధిలోనే సూపరింటెండెంట్ రామకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సిలిండర్లకు సంబంధించిన పాత బిల్లులు చెల్లించేందుకు లంచం ఇవ్వాలని వేదిస్తున్నాడంటూ సదరు కాంట్రాక్టర్ ఏసీబీకి సమాచారమిచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. దీంతో ఆక్సీజన్ సిలిండర్ల వ్యవహారం తేనెతుట్టెలా తయారైంది. కదిపితే.. ఎవరి మెడకు చుట్టుకుంటుందనే భయాందోళన ఎంజీఎం అధికారులను వెంటాడుతోంది.
 
3న తెరవనున్న టెండర్లు

ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత మేల్కొన్న అధికారులు ఇటీవల ఆక్సీజన్ సిలిండర్ల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు.  ఈనెల 13వ తేదీన టెండర్లు తెరువనున్నారు. అరుుతే ఈ సారి ఎంత మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు.. మళ్లీ పాత కాంట్రాక్టర్లే రంగంలోకి దిగుతారా... కొత్త ఏజెన్సీల పేరిట... ఎంజీఎంను తమ గుప్పిట్లోకి తీసుకుంటారా... అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజాధనాన్ని కాపాడుతారా.. వేచి చూడాల్సిందే మరి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement