బద్వేలు : ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం పథకాన్ని పాఠశాలల్లో మాత్రమే అమలు చేసేవారు. కానీ త్వరలో జూనియర్ కళాశాలల్లో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలోని జూనియర్ కళాశాలల అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్జేడీకి నివేదికలు అందజేస్తున్నారు. అయితే జూలై ఒకటి నుంచి అమలు చేస్తామంటున్నా ప్రస్తుతం కసరత్తు దశలోనే ఉండడంతో కొంతమేర ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల తరహాలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల గైర్హాజరు నివారించడంతో పేదలకు విద్యను అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆ దిశలోనే జూనియర్ కళాశాలలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు కొంతమేర బడ్జెట్ కూడా కేటాయించారు. కళాశాలల్లో వసతులు, ఇతర విషయాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నివేదికలు పంపాలని ఇంటర్ బోర్డు కమిషనర్ విజయలక్ష్మి ఆర్జేడీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్జేడీలు ఆ పనిలో తలమునకలయ్యారు.
16 వేల మందికి లబ్ధి
జిల్లాలో మొత్తం 46 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో రెండో ఏడాదికి 7,582 మంది చదువుతున్నారు. మొదటి ఏడాది ఇప్పటికే 7 వేల అడ్మిషన్లు జరిగాయని అంచనా. మరో 1,500 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే అవకాశముంది. గతేడాది కంటే మెరుగైన ఫలితాలను ప్రభుత్వ కళాశాలలు సాధించడంతో ఈ ఏడాది గతేడాది కంటే మరో వెయ్యి అధికంగా అడ్మిషన్లు రావచ్చని అధికారులు చెబుతున్నారు.
పరిశీలనకు కమిటీ ఏర్పాటు
కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలన జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డీఈఓతో పాటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉన్నారు. వీరు మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును పరి శీలించారు. ఎంత ఖర్చు, వంట తదితర వివరాలను తెలుసుకున్నారు. ప్రతి కళాశాలలో వసతి, వంటగదులు, విద్యార్థుల సంఖ్య, బియ్యం అవసరం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు, సరుకులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు తదితర వివరాల సమాచారాన్ని పరిశీలించి సేకరించారు.
ఒకటో తేదీ నుంచి అమలు కష్టమే..
ఉన్నత పాఠశాలల విద్యార్థుల కంటే ఇంటర్ పిల్లల కు అధిక క్యాలరీల భోజనం అవసరం. ఉన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పులు, 75 గ్రాముల కూరగాయలు, 7.5 గ్రాముల నూనె ఇస్తారు. అయితే ఇంటర్ విద్యార్థులు శారీరకంగా, వయస్సురీత్యా పెద్దగా ఉంటారు. వీరికి ఈ స్థాయి భోజనం సరిపోదు. ఈ విషయమై వారికి ఎంత స్థాయి భోజనం అవసరమనే విషయాన్ని నిర్ధారించలేదు. కొన్ని చోట్ల పాఠశాలలుంటే వాటిలో చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. అందుబాటులో లేని చోట ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలి. వంట ఏజెన్సీలను ఎంపిక చేయాలి. వీటన్నింటిపై అంచనా వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో అమలుకు మరికొంత సమయం పట్టవచ్చని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్నాం..
జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌలి, జిల్లా వృత్తివిద్యాధికారి, కడప
Comments
Please login to add a commentAdd a comment