
చిత్తూరు నుంచి కాలిడకన ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న వారిని అడ్డుకున్న తాలూకా సీఐ యం.లక్ష్మణ్
సాక్షి, ఒంగోలు: బతుకు దెరువు కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన పది మంది యువకులు చిత్తూరుకు వచ్చారు. ఇక్కడ ఐస్ బండ్లు నడుపుకుంటూ రెండేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అందరి వయస్సు 20 ఏళ్లలోపే. వీరి బతుకుల్లో కరోన అలజడి రేపింది. లాక్‌డౌన్‌తో ఇప్పట్లో వ్యాపారాలకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదని యజమానులు చెప్పడంతో ఎలాగైనా సొంతూళ్లకు చేరాలనుకున్నారు. వాహన సదుపాయాలు అందుబాటులో లేక కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరు నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకోవాలంటే మొత్తం 1900 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆదివారం సాయంత్రం చిత్తూరు నుంచి బయల్దేరారు.
మార్గమధ్యలో కనీసం భోజనం చేసే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఎవరైనా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తుంటే వాటిని తీసుకుంటూ మొత్తంగా మూడు రోజుల్లో 331 కిలోమీటర్లు అంటే సరాసరిన రోజుకు 110 కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంగోలు మండలం త్రోవగుంట సమీపంలో హైవే మీదుగా వస్తుండగా బుధవారం హైవేపై నిఘా పెట్టిన తాలూకా సీఐ యం.లక్ష్మణ్ వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఆహారం లేక నీరసించి ఉండటంతో భోజనం పెట్టారు. అనంతరం వారికి పరిస్థితులు వివరించి అందరినీ పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.