
యవత్మాల్‌లో ట్రక్కును ఢీ కొట్టిన బస్సు
న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ వలస కూలీల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తమ స్వస్థలాకు బయలుదేరిన పలువురు వలస కూలీలు రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో వలస కూలీలు మృతిచెందారు. ప్రతి రోజు దేశంలోని ఏదో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా.. పలవురు తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్ర యవత్మాల్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలసకూలీలు మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ బస్సులోని వలసకూలీలు షోలాపూర్ నుంచి జార్ఖండ్‌కు వెళ్తున్నారు. (చదవండి : అమానుషం: శవాల పక్కన కూలీలు)
ఝాన్సీ-మీర్జాపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం
మరోవైపు సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ-మీర్జాపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. 17 మంది వలసకూలీలతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు.