వీరఘట్టం, న్యూస్‌లైన్: పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులను అధికారులు గుర్తించారు. చిన్నారుల వయసుకు తగినట్లు ఎత్తు, బరువు లేకపోవడాన్ని గమనించిన అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో అదనపు ఆహారాన్ని ఇచ్చేందుకు మినీ మెనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఐపీడీఎస్ కమిషన్ జీఓ విడుదల చేయగా ఆ ఉత్తర్వులను జిల్లాలో ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించారు. పౌష్టికాహార లోపానికి గురైన ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న చిన్నారులకు కొత్త మెనూ ప్రకారం అదనపు ఆహారాన్ని అందజేస్తారు. పౌష్టికాహారానికి సంబంధించిన బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె, పోపు దినుసులు, అదనపు నూనె, గుడ్డు, పాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేయనున్నారు.
ఆహారాన్ని అందించే వేళలివే.....
పౌష్టికాహార లోపానికి గురైన చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజులో మూడుసార్లు ఆహారాన్ని అందజేస్తారు. ఇంటి వద్ద నాలుగు సార్లు చిన్నారులకు ఆహారాన్ని అందజేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజూ ఉదయం 9.30 గుడ్డు, 11.30గంటలకు వంద మిల్లీలీటర్ల పాలు, మధ్యాహ్నం 12 గంటలకు మినీ భోజనం అందజేస్తారు. పిల్లల తల్లులకు ఇవి తినిపించడమే కాకుండా ఇంటి వద్ద అంగన్‌వాడీ కేంద్రం నుంచి సరఫరా చేసిన బాలామృతం పౌష్టికాహారం ఉదయం 7.30కు ఒకసారి, సాయంత్రం 5.30కు 50 గ్రాముల చొప్పున జావ వలే చేసి లేదా లడ్డూలా చేసి తినిపించాలి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఉడికించిన కూరగాయలు (బంగాళాదుంపలు)గుజ్టులా తయారు చేసి తినిపించాలి. రాత్రి7.30గంటలకు నెయ్యి లేదా నూనెతో తయారు చేసిన భోజనం తినిపించాలి.
పిల్లల కోసం సర్వే ...
జిల్లాలో 18 అంగన్‌వాడీ ప్రాజెక్టులున్నాయి. అన్ని ప్రాజెక్టుల పరిధిలో 3,403 అంగన్‌వాడీ కేంద్రాలు, 789 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు ఇప్పటికే సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదికను ప్రాజెక్టు అధికారిణులు పీడీ కార్యాలయానికి అందచేసారు. జిల్లాలో వయసుకు సరిపడా ఎత్తు, బరువు లేని చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. వీరందరికీ అదనపు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
వారందరికీ ఇకపై ‘మినీ మెనూ’
Published Fri, May 23 2014 2:39 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement