సాక్షి, విశాఖపట్నం: మధురవాడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, జేఏసీలు వేణుగోపాల్, శివశంకర్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. బొమ్మల కొలువు, పులివేషాలు, తప్పెటగుళ్ళు, డప్పు వాయిద్యాలు, హరిదాసు కోలాహలం తో మధురవాడ శిల్పారామం ప్రాంగణం సందడి గా మారింది.
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 8 నెలల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం రాజధాని ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఉదయం లేచిందే మొదలు రాజకీయం కావాలని.. అదే బాటలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా నడుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మొద్దని..ఆయనది వాడుకుని వదిలేసే నైజం అని..పవన్‌ను కూడా అలాగే చేస్తారని తెలిపారు. అమరావతి రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని వెల్లడించారు.
అందరికి నవరత్నాలు..
ప్రజలందరికి నవరత్న పథకాలు అందించాలనే సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. సంక్రాంతి పండగ అంటే సంప్రదాయం గా తరతరాలుగా వస్తున్న ఆచారం అని పేర్కొన్నారు. ఆ ఆచారాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
ప్రతి ఇంట సంక్రాంతి..
ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారని జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. ప్రతి ఇంటికి సంక్రాంతి ఆనందాన్ని తీసుకెళ్ళాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment