సాక్షి, తాడేపల్లి: మే ౩ వరకు లాక్‌డౌన్ పొడిగింపు మంచి నిర్ణయమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతూనే.. వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించామని ఆయన తెలిపారు.
(రూ.100 కోట్ల సాయం.. మోదీ ప్రశంస!)
రేపటి నుంచి రెండో విడత రేషన్ అందిస్తామని.. రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా రేషన్‌దారులకు కూపన్లు అందిస్తున్నామన్నారు. కూపన్ల మీద ఉన్న సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రేషన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
అర్హత ఉన్న పేదలకు 5 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. లాక్‌డౌన్‌లో ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఇబ్బంది పడకూడదని సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. జనతా బజార్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయమని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. హాట్‌స్పాట్ గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావసరాలను ఇంటికే పంపిణీ చేస్తున్నామని.. ప్రజలకు అవసరమైన మందులను కూడా అందిస్తామని వెల్లడించారు. రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు తల్లులు అకౌంట్‌లో పడతాయని ఆయన వెల్లడించారు.
క్వారంటైన్ పూర్తయిన వారిలో పేదలుంటే ఆదుకోమని సీఎం జగన్ చెప్పారన్నారు. కరోనా టెస్టులు చేయాలని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని.. ఆ నేతల విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ‘‘ప్రతిరోజు 2 వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నాం. దేశంలో ఎక్కువ మందికి టెస్ట్‌లు చేస్తున్న ప్రభుత్వం మనదే. అనుమానితులుంటే వెంటనే వారికి కరోనా టెస్టులు చేస్తున్నాం. 2 వేల క్వారంటైన్ పడకలు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా నియంత్రణకు సీఎం జగన్ చర్యలను జాతీయ మీడియా ప్రశంసించిందని’’ మంత్రి బొత్స పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌పై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రధానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు ఎందుకు వివరించలేదని.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబేనని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment