మంత్రి బొత్స ఇంటి ముట్టడి | Minister Botsa Satyanaryan house Obsession | Sakshi
Sakshi News home page

మంత్రి బొత్స ఇంటి ముట్టడి

Published Sat, Sep 28 2013 3:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Minister Botsa Satyanaryan house Obsession

విజయనగరం(విద్యుత్ విభాగం),న్యూస్‌లైన్ : సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ముందుగా స్థానిక కోట జంక్షన్ నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చిన విద్యుత్ ఉద్యోగులు మంత్రి ఇంటి వద్దగల మెయిన్‌రోడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారం తా రహదారిపై బైఠాయించి దిక్కులు పిక్కటిల్లేలా సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా  జేఏసీ చైర్మన్, కన్వీనర్ డీఆర్‌ఎస్ వరప్రసాద్, బీవీ రమణ మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రం కోసం 13 జిల్లాల ప్రజలు  రెండు నెలలుగా అలుపెరుగని పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. 
 
రాష్ర్టంలో మెజార్టీ ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విడ్డూరమని తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయం కోసం సోనియాగాంధీ విభజన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. సమైక్య ఆందోళనలకు అన్ని వర్గాల ప్రజలూ సహకరిస్తున్నారని, భవిష్యత్‌లో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా సోనియా గాంధీ తెలుగు ప్రజల మనోభావాలు గుర్తించి సమైక్య ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు వెంకటరాజు, దైవప్రసాద్‌లతో పాటు ఇతర ప్రతినిధులు నిర్మలమూర్తి, రోజాకుమార్, బీకే ప్రసాద్, ఎంవీ రామారావు, శివకుమార్,  ఎన్. కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement