రాష్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు రోజులుగా విజయనగరంలో ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన కేసులో ఇప్పటి వరకు 35 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కార్తీకేయ ఆదివారం వెల్లడించారు. విజయనగరం పట్టణంలో విధించిన కర్ఫ్యూ ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పారు. పట్టణ వీధుల్లో ఎవరైన కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర బలగాలను విజయనగరంలో భారీగా మోహరించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరం. రాష్ట్ర విభజనకు ఆయన ముఖ్య కారకుడని స్థానికులు భావిస్తున్నారు. దాంతో గత రెండు రోజులుగా బొత్స, ఆయన బంధువుల ఆస్తులపై సమైక్యవాదులు పెద్ద పెట్టున విధ్వంసానికి పాల్పడుతున్నారు. దాంతో విజయనగరం అట్టుడుకుతుంది. దీంతో ప్రభుత్వం పోలీసు బలగాను మోహరించింది.