
రాజీనామా ఆమోదింపజేసుకోవడానికి గంటా రెడీ...
రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి సోమవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవనున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి సోమవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీరిద్దరు గతంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వాటిని పక్కనపెట్టడం, అదే సమయంలో రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలంటూ వారిపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో నేరుగా గవర్నర్‌ను కలిసి ఆమోదించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గంటా శ్రీనివాసరావు ఆదివారం రాజ్‌భవన్‌కు ఫోన్ చేసి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. తనతోపాటు మరో ఇద్దరు మంత్రులు కూడా కలుస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆయా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
అంతకుముందు గంటా శ్రీనివాసరావు వైజాగ్‌లో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌ను కలిసే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తనతోపాటు ఏరాసు ప్రతాపరెడ్డి, విశ్వరూప్ కూడా గవర్నర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించుకునేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. విశ్వరూప్ మాత్రం గంటా వ్యాఖ్యలతో విభేదించారు. అమలాపురంలో ఉన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ విభజన విషయంలో హైకమాండ్ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నవంబర్ 2న మంత్రి పదవితోపాటు కాంగ్రెస్‌కు కూడా రాజీనామా చేస్తానని ఇటీవల రావులపాలెంలో ప్రకటించానని, అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. హైకమాండ్ పెద్దలు విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని ఆశిస్తున్నానని, నవంబర్ 1 వరకు వేచి చూసిన తర్వాత మంత్రి పదవికి, పార్టీకి గుడ్‌బై చెబుతానని పేర్కొన్నారు. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తన రాజీనామా ఆమోదంపై ఇంతవరకు అధికారికంగా మాట్లాడలేదు. రాజీనామాను ఆమోదింపజేసుకుంటారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. రాష్ట్రం విడిపోయినా కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఏరాసు గత కొంతకాలంగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. హైకమాండ్ పెద్దలు కూడా ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏరాసు రాజీనామాను ఆమోదించుకుంటారని గంటా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. మరో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ఆది వారం ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
హైకమాండ్ తీరు సరికాదు!
గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, హైకమాండ్ పెద్దల తీరు, రాజీనామా వంటి అంశాలపై మంతనాలు జరిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల రోజులుగా ఉధృతంగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో సమన్వయం లేకుండా పోయిందని, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారే ఉద్యమం చేసుకుపోవడంవల్ల ప్రయోజనం లేకుండా పోతోందని కూడా మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి వెళతారని, అందులో భాగంగా తొలుత మంత్రి పదవికి, ఆ తర్వాత కొద్దిరోజులకు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారని సీమాంధ్రకు చెందిన ఓ మంత్రి చెప్పారు.