భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం | Minister Kannababu Review On Visakha Government Land Conservation | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

Published Thu, Jun 25 2020 8:16 AM | Last Updated on Thu, Jun 25 2020 8:16 AM

Minister Kannababu Review On Visakha Government Land Conservation - Sakshi

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు, చిత్రంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

సాక్షి, విశాఖపట్నం: భూ ఆక్రమణదారులు ఎంతటివారైనా సరే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. విశాఖలో విలువైన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకునే విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. పంచగ్రామాల భూసమస్య, గాజువాక హౌస్‌ కమిటీ భూములపై తదుపరి సమీక్ష సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. జిల్లాలో పేదలందరికీ ఇంటిస్థలం, విశాఖలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, పంచగ్రామాల భూ సమస్య తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ,  మాధవి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ఇంతవరకూ దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి జూలై 8వ తేదీన ఇంటిపట్టాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల సూచనలూ పరిగణనలోకి తీసుకుంటున్నామంటే పారదర్శకతకు ఒక నిదర్శనమని అన్నారు.

అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని చెప్పారు. అనర్హుల జాబితాలో ఉన్నవారికి అధికారులు వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించాల్సి వచ్చిందో వెల్లడించాలని అధికారులను ఆదేశించామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇంకా మిగిలిన అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. 

కొంతమంది కోర్టుకెళ్లారు..
జిల్లాలో ఇంటిస్థలాల పంపిణీ కోసం ఆరు వేల ఎకరాలను సమీకరించినట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. కొంతమంది వ్యక్తులకు కోర్టుకు వెళ్లి ఆపడం వల్ల కొన్నిచోట్ల జాప్యమవుతోందని అన్నారు. ఆ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టరును ఆదేశించినట్లు తెలిపారు.  

లీగల్‌ సెల్‌ ఏర్పాటు
రాష్ట్రంలోనే అత్యధిక విలువైన భూములు విశాఖలోనే ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. భవిష్యత్తులో నగరానికి మరింత విలువ పెరగబోతోందని చెప్పారు. దీంతో కొంతమంది రకరకాల న్యాయవివాదాలు సృష్టించి ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల నష్టపోతున్న వ్యక్తులు ప్రభుత్వంపై, విజయసాయిరెడ్డిపై ఎదురుదాడికి తెగిస్తున్నారని చెప్పారు. విశాఖ డివిజన్‌లోనే 4,900 ఎకరాలు వివాదాల్లో, ఆక్రమణల్లో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరు నేతృత్వంలో లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. 

చూస్తూ ఊరుకోవాలా?
గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూఅక్రమాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు చేస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. సిట్‌ నివేదిక వచ్చేవరకూ ప్రభుత్వ భూములు పరాధీనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఓ విలేకరి ప్రశ్నకు స్పందించారు. ప్రజా ఆస్తులకు సంరక్షకుడిగా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ పక్కాగా అమలుచేస్తామని ఉద్ఘాటించారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి పటిష్ట చర్యలు తీసుకొనేలా అధికారులకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. 

స్వీయ నియంత్రణతో ‘కోవిడ్‌’ కట్టడి
కోవిడ్‌ 19 కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాలకు వచ్చినపుడు మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 

ప్రభుత్వ భూముల్లో బోర్డులు
విశాఖ పరిసరాల్లో ఎంతో విలువైన భూములు గత ప్రభుత్వ హయాంలో పరాధీనమయ్యాయని మంత్రి కన్నబాబు చెప్పారు. అలాంటి పరిస్థితులు కొనసాగకుండా తక్షణమే ప్రభుత్వ భూములను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. గాజువాకలో అన్యాక్రాంతమవుతున్న చెరువులను రక్షించి సుందరీకరణ చర్యలు తీసుకోవాలని సూచించామని చెప్పారు.

ల్యాండ్‌ ఆడిట్‌ జరగాలి..
గతంలో పారిశ్రామిక, వ్యాపార, విద్యా తదితర అవసరాల కోసం భూములు పొందిన వారంతా ఆయా అవసరాలకే వినియోగిస్తున్నారా లేదా అనే విషయమై ల్యాండ్‌ ఆడిట్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్‌ కూడా తక్షణమే నిర్వహించాలని ఆదేశించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచి్చన విధానాల వల్ల చివరకు కంప్యూటర్‌ ఆపరేటర్లు సైతం భూరికార్డుల్లో వివరాలు తారుమారు చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement