సాక్షి, తిరుమల: శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అబ్దుల్ హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నిర్మాత రాకేష్ రెడ్డి ఉదయం విఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేశారు.
దేవుని ఆశీస్సులు ఉండాలి:కొడాలి నాని
మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దేశం, ప్రపంచంలో అనేక వ్యవస్థలు కుప్పకూలి ఆర్థికంగా చితికి పోయాయన్నారు. కరోనా నుండి త్వరగా కోలుకోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణకు సమయం ఉంది..
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి త్వరగా నాశనం అయి.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. మంచి వర్షాలు కురిసి రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంత్రివర్గ విస్తరణ.. ముఖ్యమంత్రి నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ కి ఇంకా సమయం ఉందని కాటసాని తెలిపారు.
దివంగత సీఎం జయలలితపై చిత్రం
నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తమిళనాడు దివంగత సీఎం జయలలిత పై చిత్రం నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా బారి నుండి ప్రజలను రక్షించాలని దేవున్ని కోరుకున్నానని తెలిపారు. కరోనా కారణంగా సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని, త్వరలో కోలుకొని పూర్వ వైభవం వస్తుందని ఆశీస్తున్నామన్నారు. జయలలిత అనే చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని, తెలుగు, తమిళం తోపాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని తీస్తామని తెలిపారు. జయలలిత జీవితంలో ఓ ఘట్టాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment