సాక్షి, మచిలిపట్నం: టీడీపీ బురద చల్లుడు ప్రయత్నాలు మానుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలుపుకుంటూ సంక్షేమ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో 8 ప్రధాన అంశాలపై చర్చించామని వెల్లడించారు. వైఎస్సార్ రైతు భరోసా, అర్హులందరికి ఇళ్లు, ఇసుక కొరత, అంశాలపై చర్చించామన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సూచనలు కూడా స్వీకరిస్తామని కన్నబాబు స్పష్టం చేశారు.
హామీలు నెరవేర్చకుండా మాపై నిందలా:పేర్ని నాని
టీడీపీ పాలనలో హామీలు నెరవేర్చకుండా.. ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని.. టీడీపీ తీరుపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. టీడీపీ ఇచ్చిన హామీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నెరవేర్చాలంటూ పగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు.. అమలు కానీ హామీలతో మహిళలు, రైతులను మోసం చేశారని విమర్శించారు. పార్టీ కండువాలతో పనిలేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం అని పేర్కొన్నారు. దీక్షల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించి సింపతి పొందాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గడిచిన మూడు మాసాలుగా గుర్తుకురాని దీక్ష ఈ రోజే గుర్తుకు వచ్చిందా అని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉందని..ఇసుక కొరత సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇసుక నూతన పాలసీ విధానం వచ్చాక.. అక్రమాలకు బ్రేక్ పడిందన్నారు. అవినీతికి తావులేకుండా సీఎం జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment