సాక్షి, విశాఖపట్నం : విజయవాడ నుంచి విశాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బయలుదేరారు. మధ్యాహ్నం విశాఖకు గౌతమ్ రెడ్డి చేరుకోనున్నారు. 12.30గంటలకు ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ, స్థానిక గ్రామాలు, ప్రజల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనున్నారు. ఒంటి గంటకు ఎల్ జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ పరిశీలన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. 1.30 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మేకపాటి పరామర్శించనున్నారు. గురువారం రాత్రి వరకూ ఫ్యాక్టరీలో లీకేజ్ కట్టడి, బాధితుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించారు. విశాఖ ప్రమాదంతో పరిశ్రమల శాఖను, అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. (యుద్ధ ప్రాతిపదికన స్పందించాం)
ఇప్పటికే ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితం చెందే పరిశ్రమల జాబితాను గౌతమ్ రెడ్డి తెప్పించుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయం చేస్తున్న అధికారులకు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు ఆస్పత్రి ప్రాంగణంలో అధికార యంత్రాంగంతో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలు, పారిశ్రామిక జోన్‌లు, పరిశ్రమల పరిస్థితులపై చర్చించనున్నారు. వేసవి కాలం, ఉష్ణోగ్రతల మార్పుకు అనుగుణంగా పట్టణ పరిధిలో ఉన్న పరిశ్రమలు, స్థానిక ప్రజల రక్షణకై ఎలా వ్యవహరించాలన్నదానిపై అధికారులతో చర్చించనున్నారు. తాజా దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.
Comments
Please login to add a commentAdd a comment