సాక్షి, అమరావతి: దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులపై దాడి ఘటన దురదృష్టకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఏపీ ప్రజలను ఎందుకు రాష్ట్రంలోకి అనుమతించడానికి నిరాకరిస్తున్నామో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా ఆవేదనతో వివరించారని తెలిపారు. గురువారం రాత్రి 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడిన వారిని రాష్ట్రంలో అనుమతించామని.. వారిని ప్రత్యేక బస్సులో క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని సుచరిత పేర్కొన్నారు. (క్రెడిట్ కార్డు బకాయిలు కూడా కట్టక్కర్లేదా?)
కేంద్రం స్పష్టంగా చెప్పింది...
‘‘లాక్‌డౌన్ అంటే ఏమిటో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ అన్నిరాష్ట్రాలకూ మార్గదర్శకాలు పంపించింది. విపత్తు నివారణా చట్టాన్ని ప్రతిరాష్ట్రమూ పాటించాలని స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రాల వారు ఏదైనా రాష్ట్రంలో చిక్కుకుపోతే వారికి ఆయా రాష్ట్రాలకు చెందిన యంత్రాంగమే కనీస అవసరాలను కల్పించాల్సి ఉంటుంది. మార్గ దర్శకాలను పాటించకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని’’ ఆమె పేర్కొన్నారు
(ఆ ఘటన దురదృష్టకరం: ఏపీ డీజీపీ)
ఇది చాలా ప్రమాదకరం..
ఏపీలో ఎన్ని జాగ్రత్తలు చేపట్టిన.. ఇలా మూకుమ్మడిగా వస్తే వారి ఆరోగ్యాలకే కాదు.. వారి కుటుంబ సభ్యులు, ప్రజలకు కూడా ప్రమాదం అని చెప్పారు. రాజకీయ కోణాల్లో ఈ సమస్యను చూడటం అత్యంత దురదృష్టకరమని.. కరోనా వైరస్ వ్యాపించకుండా ఏపీ ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందో.. వలంటీర్లు,పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నారో ప్రజలందరికి తెలుసన్నారు. ఇటువంటి సమయంలో కొందరు రాజకీయ కోణంలో ఆలోచనలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజలను రెచ్చగొట్టి.. పోలీసులపైకి రాళ్లు విసిరేలా పురిగొల్పడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఘటనలను ఎల్లో మీడియా పెద్ధగా చూపించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నించడం తగదన్నారు.
అందుకే పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాం..
తెలంగాణలో విదేశీ ట్రావెల్ హిస్టరీ లేని ఇద్దరు వైద్యులకు కూడా కరోనా వైరస్ సోకిందని.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఇక్కడున్న వారికీ వైరస్ విస్తరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోందని వివరించారు. అందుకే ఏ ప్రాంతంలో ఉన్నవారు అక్కడే ఉండాలని.. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. సమస్యలుంటే తక్షణమే కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పొందుగుల చెక్‌పోస్ట్ వద్ద ఉన్నవారితో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడారని తెలిపారు. 14 రోజుల క్వారంటైన్‌కు సానుకూలత తెలిపిన వారిని ప్రత్యేక బస్సుల్లో తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు అనుమతిస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment