
మేయర్‌పై మంత్రి గుర్రు
నెల్లూరు మేయర్ అజీజ్ వ్యవహారం మంత్రి నారాయణకు మరోసారి ఆగ్రహం తెచ్చింది.
► సీడీఎంఏకు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా
కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఆదేశాలు
►వాయువేగంతో జీఓ విడుదల
నెల్లూరు : మేయర్ అజీజ్ వ్యవహారం మంత్రి నారాయణకు ఆగ్రహం తెచ్చింది. కార్పొరేషన్ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లును తాను సొంత నిర్ణయం ద్వారా బదిలీ చేయించిన అనంతరం అజీజ్ చిన్నబాబు లోకేష్‌ను సంప్రదించడంతో మంత్రి అసహనంగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో మేయర్ అజీజ్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు, కమిషనర్ బదిలీ నిలిచిపోయిందని మేయర్ వర్గీయులు ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం పలు పత్రికల్లో మేయర్ అజీజ్ ప్రయత్నాలు ఫలించాయని కథనాలు రావడంతో మంత్రి నారాయణకు కోపం వచ్చింది. తాను బదిలీ చేసిన తర్వాత కూడా మేయర్ అజీజ్ తన నిర్ణయానికి వ్యతిరేకంగా పావులు కదపడంతో తనకు పార్టీలో చులకనభావం వస్తుందనే ఉద్దేశంతో కమిషనర్ బదిలీని యథావిధిగా చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
జీఓ జారీ
గత నెల 29వ తేదీ రాత్రి కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేయర్ అజీజ్ కమిషనర్ బదిలీని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వారం రోజుల పాటు నడిచిన నాటకీయ పరిణామాలకు సోమవారం ఫుల్‌స్టాప్ పడింది. సీడీఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికలా వల్లవన్కు వెంటనే కమిషనర్ సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించినట్లు సమాచారం. దీంతో సోమవారం మధ్యాహ్నం హుటాహుటిన కమిషనర్ వెంకటేశ్వర్లును సీడీఎంఏకు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా కార్పొరేషన్కు ఉత్తర్వులిచ్చారు. అయితే ప్రస్తుతం కమిషనర్ సెలవులో ఉన్నారు.
ఇన్చార్జి కమిషనర్‌గా జేసీ ఇంతియాజ్
కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ అవడంతో, నూతన కమిషనర్ హరీష్ బాధ్యతలను స్వీకరించేంత వరకు జాయింట్‌కలెక్టర్ ఇంతియాజ్ ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. సీడీఎంఏ నుంచి వచ్చిన జీఓలో ఈ మేరకు పేర్కొన్నారు. మరోవైపు మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ మధ్య వార్ ఇంతటితో ఆగుతుందా, లేక కొనసాగుతుందాననే అంశం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది.