
నెల్లూరులో గురుశిష్యుల వార్!
కార్పొరేషన్ కమిషనర్ బదిలీ వ్యవహారంలో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌ల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి.
► కమిషనర్ బదిలీ ఆపడానికి మేయర్ అజీజ్ ప్రయత్నం
► ససేమిరా అంటున్న మంత్రి నారాయణ
నెల్లూరు : కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ వ్యవహారంలో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌ల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు తీవ్రమయ్యాయి. కమిషనర్ బదిలీని నిలుపు చేయించాలని మేయర్ రంగంలోకి దిగారు. కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయడంలో భాగంగా కమిషనర్‌ను సాగనంపాల్సిందేనని మంత్రి పట్టుదలతో ఉన్నారు. దీంతో గురుశిష్యుల మధ్య వార్ మొదలైంది.
కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాలు, అభివృద్ధి పనులను వేగంగా నడిపించడంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విఫలమయ్యారని మంత్రి నారాయణ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. సొంత జిల్లాలోని సొంత కార్పొరేషన్‌నే గాడిలో పెట్టలేకపోతే మున్సిపల్‌శాఖ మంత్రిగా రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలను ఎలా గాడిలో పెట్టగలనని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారంలో మంత్రి నేరుగా జోక్యం చేసుకున్నారు. కార్పొరేషన్‌లో తనకు తెలియకుండా ఏ పని జరగరాదని అధికారులను ఆదేశించారు. అధికారపార్టీకి చెందిన మేయర్‌గా తానుండగా మంత్రి నేరుగా జోక్యం చేసుకోవడం పట్ల మేయర్ అజీజ్ అసహనంతో ఉన్నారు. ఇటీవల జరిగిన రొట్టెల పండగ వివాదాన్ని కారణంగా చూపి మంత్రి నారాయణ కమిషనర్‌ను బదిలీ చేయించారు.
సొంత పార్టీకి చెందిన తనకు ముందుగా చెప్పకుండా ఉన్నఫళంగా కమిషనర్‌ను బదిలీ చేయడంపట్ల మేయర్ లోలోన రగిలిపోతున్నారు. రొట్టెల పండగ సందర్భంగా చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు, ఎస్సీ సబ్‌ప్లాన్ టెండర్లకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం కొంత కాలంపాటు కమిషనర్ కొనసాగాల్సిందేనని మేయర్ పట్టుబట్టారు. సొంతపార్టీకి చెందిన కార్పొరేటర్లు, పార్టీకి సంబంధించి డివిజన్ ఇన్‌చార్జ ల మంచి కోసమే తాను ఈ డిమాండ్ చేస్తున్నట్లు అజీజ్ తన మద్దతుదారుల వద్ద చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన రెవెన్యూ అధికారి హరీష్‌ను కమిషనర్‌గా నియమిస్తే తమ మాట చెల్లుబాటు కాదనే అభిప్రాయం మేయర్‌తో పాటు అధికారపార్టీకి కార్పొరేటర్లలో కూడా ఉంది.
ఈ కారణంతోనే మేయర్ అజీజ్ కమిషనర్ బదిలీని ఎలాగైనా నిలపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి ద్వారా మంత్రితో రాయబారాలు కూడా సాగించారు. అయితే కమిషనర్ బదిలీని నిలుపుదల చేయడానికి మంత్రి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బదిలీ తాత్కాలికంగా ఆగుతుందా.. లేక నేడో రేపో కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించేందుకు అనుగుణంగా రెవెన్యూశాఖ నుంచి ఆయనను రిలీవ్ చేస్తారా అనే అంశం కార్పొరేషన్ వర్గాల్లోనూ, తెలుగుదేశంపా ర్టీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.