
'మా ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఆధారాలున్నాయి'
న్యూ ఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని నెల రోజులు జైల్లో పెట్టడం అక్రమం అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో సెక్షన్ -8 అమలు అవసరమని కేంద్రానికి ఇప్పటికే నివేదిక ఇచ్చామని ప్రత్తిపాటి తెలిపారు.
పొగాకు బోర్డు ఇచ్చిన ఇండెంట్ మేరకే పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. బోర్డు ఇచ్చిన హామీల మేరకే రైతులు పొగాకు సాగు చేశారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్టు మంత్రి చెప్పారు. జూలై 4న గుంటూరులో పొగాకు రైతు సమస్యల పరిష్కారానికి తుది నిర్ణయం తీసుకుటామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.