మంత్రి ప్రత్తిపాటి ఎద్దేవా
కొరిటెపాడు (గుంటూరు) : అడ్రస్‌లేని కాంగ్రెస్ పార్టీకి ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షుడని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 125 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న రఘువీరా రాజమండ్రిలో రణభేరి మోగిస్తామని ప్రకటించడం విడ్డూరంగా వుందన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన నానా అగచాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఇక మనుగడ వుండదన్నారు. విచక్షణారహితంగా రాష్ట్రాన్ని ఎందుకు విభజించాల్సి వచ్చిందో ముందు రఘువీరా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. ముందు సోనియాగాంధీపై రణభేరి మోగించాలని హితవు పలికారు. చేసిన తప్పులకు చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మహాసంకల్ప సభకు 13జిల్లాల నుంచి లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సంవత్సరంలో చేసిన అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి వివరించనున్నారని తెలిపారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు పరుస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చచ్చి, కుళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎవరూ బతికించలేరన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని సలహాలు, సూచనలు అందించాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, వట్టికూటి హర్షవర్ధన్, పొన్నూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సజ్జా హేమలత పాల్గొన్నారు.
అడ్రస్ లేని పార్టీకి రఘువీరా అధ్యక్షుడు!
Published Mon, Jun 8 2015 4:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM