దాళ్వాకు నీటి ఎద్దడి ఉండదు
తాడేపల్లిగూడెం : దాళ్వా పంట సాగుకు నీటి ఎద్దడి ఉండదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు భరోసా ఇచ్చారు. జిల్లాలో సాగునీటి పరిస్థితులపై తాడేపల్లిగూడెంలో మంగళవారం ఆయన ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చి తరువాత సాగునీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, పంటకు కావలసిన నీటి వసతుల ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంటకునీటి ఎద్దడి లేకుండా చెరువులను వారం రోజులలోగా నింపుకోవాలని కోరారు. డ్రెయిన్ల నీరు వృథా కాకుండా అడ్డుకట్టలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో దాళ్వా ఆకుమడులు సిద్ధం చేసుకోవాలని రైతులను కోరారు. వ్యవసాయాధికారులు గ్రామాలలో నారు మడు ల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. అవసరమైన చోట్ల రెగ్యులేటర్లు, షట్టర్లు, నీరు వృధా కాకుండా కంట్రోలింగ్ పాయింట్లు సిద్దం చేసుకోవాలని, లస్కర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసమాధవ, ఈఈ శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసరావు, డ్రెయిన్స్ డీఈ సాయిబాబా, ఏడీఏ ఎన్.శ్రీనివాసరావు, తహసిల్దార్ పాశం నాగమణి, ఎంపీడీవోలు జీవీకే మల్లికార్జునరావు, దోసిరెడ్డి పాల్గొన్నారు.