Minister Pydikondala Manikyala Rao
-
ఆ సీఐ సంగతి చూస్తా..
► తాడేపల్లిగూడెంలో మంత్రి మాణిక్యాలరావు బూతు పురాణం ► ఫ్లెక్సీ వివాదంలో ఇదీ తీరు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓ సీఐ సంగతి తేలుస్తానంటూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లి గూడెంలో బూతు పురాణానికి పాల్పడి విమర్శలపాలయ్యారు. అసభ్య పదజాలం తో విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం తెల్లవారు జామున వైఎ స్సార్సీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయమై వివాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పుట్టిన రోజు కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బస్టాండ్ సమీపంలో ఫ్లెక్సీ పెట్టారు. దీనిపై బీజేపీ నేతలు వారితో ఘర్షణకు దిగారు. కాసేపటికి అక్కడకు చేరుకున్న మంత్రి మాణిక్యాలరావు కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావుపై విరుచుకుపడ్డా రు. వివాదం ముదరడానికి స్థానిక సీఐ చేతకాని తనమే కారణమంటూ బూతు పురా ణం అందుకున్నారు. ‘నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడా. వాడి సంగతి చూస్తా’ అంటూ రెచ్చిపోయారు. ఆ సీఐపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని, తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలన్నారు.కాగా మంత్రి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. -
కృష్ణా పుష్కరాలకు 175 ఘాట్లు
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : కృష్ణాపుష్కరాలకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పుష్కర భక్తుల కోసం 175 ఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.150 కోట్ల పనులు చేపట్టి రోడ్లను అనుసంధానం చేశామని చెప్పారు. పుష్కరాల్లో రోజూ 15లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు పలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థల సాయంతో కార్యాచరణ రూపొందించామన్నారు. ఐదు కోట్ల రూపాయలతో తిరుపతి నమూనా దేవాలయం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పిండప్రదానాలకు రెయిన్‌ప్రూఫ్ టెంట్లను అందుబాటులో ఉంచామని, పురోహితులకు గుర్తింపు కార్డులు జారీ చేశామని వివరించారు. పుష్కరాల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని చెప్పారు. దీని ద్వారా ఏ ఘాట్‌లో ఎంతమంది జనం ఉన్నారు.. ఘాట్లకు ఎలా వెళ్లాలనే వివరాలు తెలుస్తాయన్నారు. పుష్కర భక్తుల కోసం విజయవాడ నగరం వెలుపల 35 పుష్కర్ నగర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క నగర్లో ఐదువేల మంది ఉండవచ్చని చెప్పారు. ఆ 12 రోజులూ వాహనాలను విజయవాడ నగరంలోకి అనుమతించబోమని, భక్తులను ఉచితంగా బస్సుల్లో ఘాట్ల వద్దకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
యానాదుల అభివృద్ధికి కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : యానాదుల సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. మండలంలోని పడాల మార్కెట్ యార్డులో శనివారం జరిగిన యానాదుల ఐక్యగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్ తరహా విధానాలను అనుసరించడం వల్ల పేదలంతా పేదలుగానే మిగిలిపోయారన్నారు. యానాదుల జాతి గుర్తింపునకు, రక్షణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. పేదలు ఉన్నత విద్యావంతులైనప్పుడే అసమానతలు తొలగుతాయని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యానాదుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ యానాదులు రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు. బీసీ జాబితాలోని ఉపకులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. తొలుత గొల్లగూడెం సెంటర్ నుంచి యానాదులు ర్యాలీగా పడాల మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన మహాసభలో గ్రేహౌండ్స్ ఎస్పీ వెంకటేశ్వర్లు, యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాస్, మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, పడాల మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్‌చౌదరి, సినీ కళాకారుడు పి.ఆంజనేయులు తదితరులు మాట్లాడారు. -
ఈలి నానికి మంత్రి పైడికొండల సవాల్
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : మాజీ ఎమ్మెల్యే ఈలి నాని తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సవాల్ విసిరారు. మంత్రి శనివారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ.. తాడేపల్లి నుంచి న్యూఢిల్లీ వరకు ఎక్కడైనా తాను కేసులు పెట్టించినట్లు నాని నిరూపించగలడా అని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టించినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. ఈలి నానిపై తాను తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నానని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాల్‌రావు స్పందించారు. నాని నిరూపించలేని పక్షంలో ఏం చేస్తాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తానని అన్నారు. -
వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. సోమవారం హౌసింగ్ బోర్డు ఎదురుగా వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో కోటీ 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న విత్తన పరిశోధనా కేంద్రానికి మంత్రి మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మునిసిపల్ చైర్మన్ బొలిశె ట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు బెడద తప్పించేందుకు, మంచి విత్తనాలు పొందేందుకు విత్తన పరీక్షా కేంద్రాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, ఎంపీడీవోలు మల్లికార్జునరావు, దోసిరెడ్డి, తహసిల్దార్ పాశం నాగమణి, వ్యవశాయ శాఖ ఇన్చార్జి ఏడీ కె.శ్రీనివాసరావు, వ్యవసాయశాఖధికారి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌కల్యాణ్ మద్దతూ ప్లస్ పాయింటే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని కమలదళంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నిఘా వర్గాల నివేదికల ఆధారంగా భవిష్యత్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అటు టీడీపీ, ఇటు బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ ముహూర్తం ఎప్పుడొస్తే అప్పుడు జిల్లాకు మరో మంత్రి పదవి, అది కూడా బీజేపీ కోటాలో అవకాశం దక్కుతుందని కమళశ్రేణు మధ్య చర్చ జరుగుతోంది. పొరుగున ఉన్న పశ్చిమగోదావరి జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్థానే జిల్లా నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరు కమాండ్ పరిశీలనలో ఉందనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. మంత్రి మాణిక్యాలరావు, వీర్రాజులది ఒకే సామాజికవర్గం. విస్తరణలో మాణిక్యాలరావు స్థానే మంత్రి పదవిని వీర్రాజుకు కట్టబెట్టే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. నిఘా వర్గాలతో పాటు సీఎం చంద్రబాబు సొంత నివేదికలు మాణిక్యాలరావుకు వ్యతిరేకంగా వచ్చాయంటున్నారు. అదేవిధంగా తన శాఖలో ఉన్నతాధికారి మార్పు కోసం మంత్రి కోరిన సందర్భంలో కూడా సీఎం సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అవసరమైతే అమాత్య పదవినే మార్పు చేస్తాం కానీ ఆ అధికారిని మార్పు చేసేది లేదని ఖండితంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో మాణిక్యాలరావు విషయంపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టారో ఏమో తెలియదు కానీ.. మాణిక్యాలరావు ఇటీవల చంద్రబాబుని అవకాశమొచ్చినప్పుడల్లా ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందని కమలం పార్టీలో చర్చించుకుంటున్నారు. ఆయన టీడీపీ నేతలకంటే పోటీపడి మరీ బాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ మద్దతూ ప్లస్ పాయింటే.. ఎన్నికల్లో అధిష్టానం టిక్కెట్టు ఇస్తానన్నా వీర్రాజు తిరస్కరించారు. తన స్థానే రాజమండ్రి సిటీకి డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేరును వీర్రాజే ప్రతిపాదించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మంత్రి విస్తరణలో ఆకుల కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో లేకపోలేదు. ఇప్పటికే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పదవిలో ఆకుల ఉండగా.. ఇప్పుడు అదే ప్రాంతానికి, అదే సామాజిక వర్గానికి చెందిన వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి మంత్రి పదవిని ఇస్తే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, ఇతర సామాజిక వర్గాల నుంచి వచ్చే అసంతృప్తులపై కూడా అధిష్టానం ఆరా తీస్తోంది. అయితే ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగిన నేతగా హైకమాండ్‌లో పేరున్న వీర్రాజుకు ఇవేమీ అడ్డురావనే వాదన కూడా ఉంది. గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను నరేంద్రమోడీ వద్దకు తీసుకువెళ్లింది కూడా ఆయనేనంటున్నారు. ఈ క్రమంలో పవన్ మద్దతు పుష్కలంగా ఉండటం కూడా తోడై వీర్రాజుకు ఎమ్మెల్సీ ఖాయమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు రప్పించుకున్న నివేదికలు, బీజేపీ హై కమాండ్‌లో పలుకుబడి వెరసి మాణిక్యాలరావు స్థానే వీర్రాజు పేరును బీజేపీ ప్రతిపాదిస్తుందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతోనే.. పదవిని పదిలం చేసుకునే ఆరాటంతో మాణిక్యాలరావు సీఎం బాబును ఆకాశానికి ఎత్తుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా పార్టీ అధిష్టానం నిర్ణయం వీర్రాజుకు సానుకూలంగా ఉంటే మాణిక్యాలరావు మంత్రి పదవికి ఎసరు ఖాయమంటున్నారు. బీజేపీ కోటాలో పశ్చిమకు దక్కిన అమాత్య పదవిని తూర్పులో భర్తీ చేస్తారంటున్నారు. వారిద్దరిది ఒకే సామాజికవర్గం కావడంతో సామాజికంగా పెద్దగా వచ్చే ఇబ్బంది కూడా ఉండదన్న కమలం పార్టీ ఆలోచనగా ఉంది. అదే జరిగితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు మంత్రి పదవులకు (ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు) అదనంగా మరోటి చేరనుంది. -
దాళ్వాకు నీటి ఎద్దడి ఉండదు
తాడేపల్లిగూడెం : దాళ్వా పంట సాగుకు నీటి ఎద్దడి ఉండదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు భరోసా ఇచ్చారు. జిల్లాలో సాగునీటి పరిస్థితులపై తాడేపల్లిగూడెంలో మంగళవారం ఆయన ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చి తరువాత సాగునీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, పంటకు కావలసిన నీటి వసతుల ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంటకునీటి ఎద్దడి లేకుండా చెరువులను వారం రోజులలోగా నింపుకోవాలని కోరారు. డ్రెయిన్ల నీరు వృథా కాకుండా అడ్డుకట్టలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో దాళ్వా ఆకుమడులు సిద్ధం చేసుకోవాలని రైతులను కోరారు. వ్యవసాయాధికారులు గ్రామాలలో నారు మడు ల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. అవసరమైన చోట్ల రెగ్యులేటర్లు, షట్టర్లు, నీరు వృధా కాకుండా కంట్రోలింగ్ పాయింట్లు సిద్దం చేసుకోవాలని, లస్కర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసమాధవ, ఈఈ శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసరావు, డ్రెయిన్స్ డీఈ సాయిబాబా, ఏడీఏ ఎన్.శ్రీనివాసరావు, తహసిల్దార్ పాశం నాగమణి, ఎంపీడీవోలు జీవీకే మల్లికార్జునరావు, దోసిరెడ్డి పాల్గొన్నారు.