కృష్ణా పుష్కరాలకు 175 ఘాట్లు
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : కృష్ణాపుష్కరాలకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పుష్కర భక్తుల కోసం 175 ఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.150 కోట్ల పనులు చేపట్టి రోడ్లను అనుసంధానం చేశామని చెప్పారు. పుష్కరాల్లో రోజూ 15లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు పలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థల సాయంతో కార్యాచరణ రూపొందించామన్నారు.
ఐదు కోట్ల రూపాయలతో తిరుపతి నమూనా దేవాలయం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పిండప్రదానాలకు రెయిన్‌ప్రూఫ్ టెంట్లను అందుబాటులో ఉంచామని, పురోహితులకు గుర్తింపు కార్డులు జారీ చేశామని వివరించారు. పుష్కరాల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని చెప్పారు. దీని ద్వారా ఏ ఘాట్‌లో ఎంతమంది జనం ఉన్నారు.. ఘాట్లకు ఎలా వెళ్లాలనే వివరాలు తెలుస్తాయన్నారు. పుష్కర భక్తుల కోసం విజయవాడ నగరం వెలుపల 35 పుష్కర్ నగర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క నగర్‌లో ఐదువేల మంది ఉండవచ్చని చెప్పారు. ఆ 12 రోజులూ వాహనాలను విజయవాడ నగరంలోకి అనుమతించబోమని, భక్తులను ఉచితంగా బస్సుల్లో ఘాట్ల వద్దకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.