ముప్పేట దాడి | Minister Sidda Raghava Rao fire | Sakshi
Sakshi News home page

ముప్పేట దాడి

Published Sat, Jul 18 2015 4:15 AM | Last Updated on Mon, Oct 8 2018 5:23 PM

ముప్పేట దాడి - Sakshi

ముప్పేట దాడి

శుక్రవారం జరిగిన జెడ్పీ సమావేశం గరంగరంగా సాగింది. గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్ ) అధికారుల తీరుపై ముప్పేట దాడి జరిగింది. ప్రొటోకాల్ వివాదం వేడెక్కించింది. నలుగురు ఎంపీడీవోలపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ మంత్రి శిద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఒంగోలు: గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం( ఆర్‌డబ్ల్యుయస్ ) అధికారుల తీరుపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముప్పేట దాడి జరిగింది. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు.

  వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు డోలాశ్రీ బాలావీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2010 నుంచి ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్ట పరిహారం రూ.35 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాలంటూ వ్యవసాయశాఖ జేడీఏ మురళీకృష్ణను గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి నిలదీశారు. 

కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి మాట్లాడుతూ దళారుల దెబ్బకు లారీ వరి గడ్డిని రూ.25 నుంచి రూ.30 వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. పశుసంవర్థకశాఖ చొరవ తీసుకొని గడ్డిని రవాణా చేయించగలిగితే పశుపోషకులకు ఉపయోగంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. పొదిలి ప్రాంతంలో పశువులను బలవంతంగా సంతలకు తరలిస్తున్నారంటూ పొదిలి ఎంపీపీ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఒక తీర్మానం చేసి కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, దానిపై తీర్మానం చేయాలంటూ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సభ దృష్టికి తీసుకువెళ్లగా జెడ్పీ చైర్మన్‌తోపాటు సభ్యులు అంగీకరించారు.

  తాగునీటి సమస్య పరిష్కారానికి డబ్బులు పుష్కలంగా ఉన్నా సమస్య ఏమిటో చెప్పాలంటూ మంత్రి శిద్దా రాఘవరావు ఆర్‌డబ్ల్య్యుస్ అధికారులను నిలదీశారు. పథకాలు బాగుపడేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో చెప్పండి...నిధులు నేను తెప్పిస్తా అంతే గాని మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే మాత్రం సహించేదిలేదంటూ మండిపడ్డారు.  ప్రతిపాదనలు తయారుచేసి పంపామని, జెడ్పీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు చెప్పడంతో జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ జోక్యం చేసుకొని నిధులన్నీ ఒకే పథకానికి ఖర్చుచేస్తే మిగితా అభివృద్ధి పనులు కుంటుపడతాయని, దాంతోపాటు బోర్లు వేస్తే తప్పనిసరిగా నీరు పడుతుందో లేదో అనే అనుమానంతో ఆపినట్లు ప్రకటించారు.

 నలుగురు ఎంపీడీవోలపై విచారణ
 ఉలవపాడు, త్రిపురాంతకం, తర్లుబాడు, కొనకనమిట్ల ఎంపీడీవోలు అవినీతికి పాల్పడుతున్నారని చర్యలు చేపట్టాలంటూ జడ్పీటీసీ, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్‌లు ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, పాసుపుస్తకానికి వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు, చివరకు జెడ్పీటీసీ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనానికి, ట్రావెల్ అలవెన్స్‌లకు వాటా అడుగుతున్నారంటూ ధజమెత్తారు. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకొని తక్షణమే ఉలవపాడు ఎంపీడీవోను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు.

ఆర్‌డీవో స్థాయి అధికారితో విచారణకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతులరామారావు, డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావు, కదిరి బాబూరావులు హాజరుకాగా వేదికపై చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ సుజాతాశర్మ, జేసీ హరిజవహర్‌లాల్, సీఈవో ఎ.ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరసింహారావు, ఏవో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 మాగుంటకు  సన్మానం
 ఒంగోలు: స్థానిక సంస్థల ప్రతినిధిగా ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులరెడ్డిని శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ, కంచర్ల శ్రీకాంత్‌చౌదరి, జెడ్పీ సీఈవో ప్రసాద్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రతినిధిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement